Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 28 November 2023, 8:46 pmEditor : Sira News

ఎలుగు బంటి దాడిలో జూ కీపర్ మృతి 10 లక్షల పరిహారం ప్రకటించిన అధికారులు

సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖ జూ పార్క్లో విషాదం చోటు చేసుకుంది. ఎలుగుబంటి దాడి చేయడంతో.. జూ కీపర్ బనవారపు నగేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబంధించిన వివరాలను జూ పార్క్ క్యూరేటర్ నందిని సలేరియా మీడియాకు వివరించారు. విజయనగరం జిల్లా గజపతినగరానికి చెందిన నగేశ్ విశాఖ వెల్ఫేర్ సొసైటీ ద్వారా గత రెండేళ్లుగా జూలో పని చేస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం కూడా ఎలుగుబంటిని ఉంచిన ప్రదేశానికి వెళ్లాడు. అయితే, ఆ తర్వాత అతడు ఎవరికీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డు వెతికే సరికి ఆ ప్రదేశంలో తీవ్రగాయాలై పడిపోయి ఉన్న జూ కీపర్ను గమనించారు. తలమీద, ఎడమ చెయ్యిపై బలమైన గాయాలయ్యాయి. వెంటనే జూ సిబ్బంది కేజీహెచ్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు క్యూరేటర్ తెలిపారు.10 లక్షల పరిహారం ప్రకటించినట్లు ఆమె తెలిపారు. దాడి చేసిన జిహ్వాన్ అనే ఎలుగుబంటిని మిజోరాం నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.