DGP Dr. Jitender: పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర డీజిపి డా.జితేందర్

సిరాన్యూస్‌, భద్రాద్రి
పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర డీజిపి డా.జితేందర్
* శ్రీ సీతారామచంద్ర స్వామి సంద‌ర్శ‌న‌

పొరుగు రాష్ట్రాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజిపి డా.జితేందర్ సూచించారు. సోమ‌వారం రాత్రి తెలంగాణ రాష్ట్ర డిజిపి డా.జితేందర్ ఐపిఎస్ హైదరాబాద్‌ నుండి సారపాక ఐటీసి గెస్ట్ హౌస్ నకు చేరుకున్నారు.డీజిపి తో పాటు డీజీపీ ఇంటిలిజెన్స్ శివధర్ రెడ్డి ఐపీఎస్,మల్టీ జోన్-1 ఐజీపి చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ లు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.వీరితో పాటు ఇతర సిఆర్పిఎఫ్ అధికారులు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్, ములుగు జిల్లా ఎస్పీ డా.శభరీష్ ఐపిఎస్,భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే ఐపిఎస్,గ్రేహౌండ్స్ ఎస్పీ రాఘవేందర్ రెడ్డి , ట్రైనీ ఐపిఎస్ లు కూడా పాల్గొన్నారు.ముందుగా సమన్వయ సమావేశానికి విచ్చేసిన డీజిపి ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ స్వాగతం పలికారు.అనంతరం అధికారులతో సమన్వయ సమావేశాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా సమావేశంలో రాష్ట్ర డీజిపి డా.జితేందర్ మాట్లాడారు. అధికారులందరూ ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై ప్రస్తుత స్థితిగతులను డీజిపి కి వివరించారు.ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుని,అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టుల వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణ-చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే అధికారులు తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు.పొరుగు రాష్ట్రాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.కాలం చెల్లిన సిద్ధాంతాలతో అమాయకులైన ఆదివాసీలను అభివృద్ధికి,సంక్షేమానికి దూరం చేస్తూ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు విద్య,వైద్యం,రవాణా మరియు ఇతర సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తున్నాయని అన్నారు.కానీ మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ,అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అనంతరం డిజిపి తో పాటు అధికారులందరూ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *