మెట్రో రూట్ మ్యాప్ రెడీ

సిరా న్యూస్,హైదరాబాద్;
రాజధాని వాసులకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న మెట్రో ఫేజ్-2కి సంబంధించిన పనులు ఇక పరుగులెత్తనున్నాయి. ఫేజ్-2లో భాగంగా శంషాబాద్ విమానాశ్రయం మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కి.మీ మెట్రో మార్గాన్ని, నిర్మించనున్నామని, ఈ మార్గంలో మొత్తం 13 మెట్రో స్టేషన్లు రానున్నాయని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. నాగోల్ మెట్రో స్టేషన్‌తో ప్రారంభమై.. నాగోల్‌ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీనగర్‌ కూడలి, సాగర్‌ రింగ్‌రోడ్డు, మైత్రీనగర్‌, కర్మన్‌ఘాట్‌, చంపాపేట రోడ్‌ కూడలి, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్‌డీవో, హఫీజ్‌ బాబానగర్‌, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కొత్త మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు.కొత్తగా రానున్న మెట్రో రైలు స్టేషన్లకు సంబంధించి వాటి పేర్ల ఖరారుకు ట్రాఫిక్ పోలీసులు, సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని అధికారులు నిర్ణయించారు. నాగోల్‌లో ఇప్పుడున్న స్టేషన్‌ సమీపంలోనే న్యూ నాగోల్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టేషన్‌ ఎడమవైపు(ఎల్బీనగర్‌ మార్గంలో) రానుంది. ఈ రెండింటినీ కలిపేలా విశాలమైన స్కైవాక్‌ నిర్మించనున్నారు. నాగోల్‌లో మూసీ వంతెన వద్ద మంచినీటి పైపులైన్లు, హెచ్‌టీ విద్యుత్తు లైన్లు ఉన్నందున మెట్రో ఎలైన్‌మెంట్‌ను 10మీటర్లు ఎడమ వైపు మార్చాలని నిర్ణయించారు. బైరామల్‌గూడ/సాగర్‌ రోడ్‌ జంక్షన్‌లో ఫ్లైఓవర్ల కారణంగా మెట్రో లైన్‌ ఎలైన్‌మెంట్‌ను కుడివైపు మార్చాల్సిరావచ్చని అధికారులు నిర్ణయించారు.మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ స్కీమ్, హైదరాబాద్మెట్రోపై ప్రభావం చూపుతోంది. గతంలో మహిళలు, విద్యార్థినులు ఎక్కువగా మెట్రోలో ప్రయాణించేవారు. కాగా, మహాలక్ష్మీ స్కీమ్ అమలుతో వీరంతా ఆర్టీసీ బస్సులను ఆశ్రయించటంతో, మెట్రోలో ప్రయాణించే మహిళల సంఖ్య తగ్గింది. నిరుడు 5.1 లక్షలుగా ఉన్న మెట్రో ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం 4.5 లక్షలకు తగ్గిందని మెట్రో అధికారులు చెబుతున్నారు. అటు జీహెచ్ఎంసీ పరిధిలో తిరిగే ఆర్టీసీలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికుల సంఖ్య 12 లక్షలకు చేరింది. మెట్రో వచ్చిన కొత్తలో రోజుకు రెండు లక్షలమంది ప్రయాణించగా, 2023 నాటికి ప్రయాణికుల సంఖ్య 5.1 లక్షలకు చేరింది. 2023 నవంబరులో ఒకేరోజు 5.47 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *