హూజూరాబాద్ ఎవరికి హూజూర్

హూజూరాబాద్ ఎవరికి హూజూర్
కరీంనగర్, నవంబర్ 18,సిరా న్యూస్
మ్మడి కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ పట్టణానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పురిటి గడ్డగా ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన పేరు ఉంది. రాజకీయ చైతన్యం అధికంగా ఉండే ఈ ప్రాంతం.. తెలంగాణ వాదాన్ని అనేకసార్లు నిరూపించింది. అంతేకాదు ఈ ప్రాంత నాయకుడికి అన్యాయం జరిగితే ధైర్యంగా నిలబడ్డది. సానుభూతిని చూపి ఏకంగా ప్రజాక్షేత్రంలో తిరుగులేని నాయకుడిని చేసింది. అలాంటి ఈ నియోజకవర్గంలో ఒక నాయకుడు ఎనిమిదవ విజయంపై కన్నేశారు. ఈసారి ఎలాగైనా ఓడించాలని మరొక నాయకుడు పట్టుదలతో ఉన్నారు. రెండో మాటకు తావు లేకుండా హుజురాబాద్ నియోజకవర్గం ఈటెల రాజేందర్ కు పెట్టని కోట. గత ఏడు పర్యాయాలు ఆయన ఇక్కడ వరుస విజయాలు సాధించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాజీనామా చేసిన ప్రతిసారి ఇక్కడి ఓటర్లు గుండెల్లో పెట్టుకున్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం మలిదశ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ను కెసిఆర్ భర్త రఫ్ చేయడంతో ఒక్కసారిగా హుజురాబాద్ వార్తల్లో కి ఎక్కింది. అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచిన ఈటల రాజేందర్ తన సమీప ప్రత్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మీద విజయం సాధించారు. 2018 ఎన్నికల్లోనూ వీరిద్దరూ పరస్పరం తలపడ్డారు. ఆ ఎన్నికల్లోను రాజేందర్ గెలిచారు. అయితే ఈసారి ఈటెల రాజేందర్ హుజరాబాద్ మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీగా గజ్వేల్ లో కూడా బరిలో ఉన్నారు.ఈటల రాజేందర్ వరుసగా ఎనిమిదో సారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని పట్టుదలతో ఉన్నారు. రాజేందర్ ప్రత్యర్థి పాడి కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఈటెల రాజేందర్ భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీలోకి కౌశిక్ రెడ్డి వెళ్లారు.ప్రభుత్వ పథకాలపై బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమాగా ఉన్నారు. తాను చేసిన అభివృద్ధి పట్ల ఆయన నమ్మకంగా ఉన్నారు. 20 సంవత్సరాలుగా ఆయన ఈ ప్రాంత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వేలాదికోట్లతో తాను చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయని ఈటెల రాజేందర్ నమ్ముతున్నారు.. తాను నిర్మించిన ఆసుపత్రులు, రహదారులు, రైల్వే వంతెనలు, వాగులపై నిర్మించిన చెక్ డ్యాములు, కమ్యూనిటీ భవనాలు, సబ్ స్టేషన్లు, అంతర్గత రోడ్లు, గ్రామపంచాయతీ నూతన భవనాలు.. హుజరాబాద్ నియోజకవర్గానికి కొత్త రూపు తీసుకొచ్చాయని ఆయన నమ్ముతున్నారు.ఇక భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై నమ్మకం పెట్టుకున్నారు. చేసిన అభివృద్ధి తనను గట్టెక్కిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఆయన ఈ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. తనకున్న పరిచయాలతో హుజరాబాద్ లో ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అవే తనను గెలిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు.కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి వీస్తున్న సానుకూల పవనాలనే నమ్ముకున్నారు. తన తాత రాజేశ్వరరావు చేసిన సేవలు పట్ల నియోజకవర్గ ప్రజలు విశ్వాసం చూపిస్తారని ఆయన భావిస్తున్నారు. ఈ హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది డిసెంబర్ 3న తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *