అటు చెక్ పెడుతూ… ఇటు మార్పులు చేస్తూ

సిరా న్యూస్;

ముఖ్యమంత్రిగా గెలిచిన రేవంత్ వెంటనే ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఢిల్లీ అనగానే పార్టీ హైకమాండ్ ను కలుసుకోవం. కానీ ఆయన రాష్ట్ర ప్రయోజనాల రీత్యా అంటూ ప్రధాని మోదీని కలిశారు. అప్పుల్లో కూరుకున్న తెలంగాణాకు రుణాలు ఇవ్వాలని, తెలంగాణకు ఒక జాతీయప్రాజెక్టు ఇవ్వాలని కోరారు. దీంతో పాటు విభజన హమీల అమలు, రీజినల్ రింగ్ రోడ్డ్ అభివృద్ధి, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, కాజిపేటలో కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు వంటి అంశాలపై ప్రధానితో చర్చించారు. ఇప్పటి వరకు కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్ల తెలంగాణ నష్టపోయిందని, తాను ఆ తప్పు చేయను అన్న రీతిలో రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.తొలి విదేశీ పర్యటన కూడా తెలంగాణకు పెట్టుబడులు రాబట్టేందుకు అన్నట్లు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం లో పాల్గొన్నారు రేవంత్. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. తన ఇంగ్లీషు భాషపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా…. తెలంగాణ కోసమే అన్నట్లుగా తానే పారిశ్రామికవేత్తలతో చర్చిస్తూ, ఇంగ్లీషు మీడియా వాళ్లకు ఇంటర్వూలు ఇస్తూ… తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఈ పర్యటనలన్నింటిలో తెలంగాణ కోసం తాను అన్నట్లుగా సాగుతోందని అర్థమవుతోందిరేవంత్ రెడ్డి అంటే తెలంగాణ వ్యతిరేకి అన్న రీతిలో బీఆర్ఎస్ గతంలో విమర్శలు చేసేది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోయినా , తనదైన శైలిలో రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదిగారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధికార పీఠం దక్కించుకోవడంతో, తెలంగాణ అభివృద్ది కోసం తాను ఏదైనా చేసే చక్కటి అవకాశం దక్కినట్లు భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాను చేయగలిగే.. ఏ అవకాశాన్ని వదలకుండా జాగ్రత్త వహిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమనేతగా, ఆ తర్వాత పదేళ్లు రాష్ట్ర రథసారధిగా ఉన్న పొలిటికల్ జీనియస్ కేసీఆర్ తో రాజకీయాలు చేయాల్సి ఉంది. ఆషామాషీగా తాను సీఎం కాకతాళీయంగా అవలేదని రేవంత్ చెప్పే ప్రయత్నం చేస్తన్నట్లుగా కనిపిస్తోంది. అటు పార్టీలోను, పాలనలోను తన మార్కు చూపితేనే అటు బీఆర్ఎస్ చీఫ్ ను అడ్డుకోవడం, స్వంత పార్టీలో ఎవరికి అందనంత ఇమేజ్ సంపాధించుకోవడం సాధ్యమని రేవంత్ అర్థం చేసుకున్నట్లు ఆయన నెల రోజుల పాలనా తీరు చెప్పకనే చెబుతోంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గెలుపు, ఆ తర్వాత ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యంపైనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఉండనుందనడంలో ఏలాంటి సందేహం లేదు. ఢిల్లీలోను, స్వంత పార్టీలోను, తెలంగాణ ప్రజల్లోను తన ఇమేజ్ పెంచుకునే త్రిముఖ వ్యూహంతో రేవంత్ రెడ్డి సాగుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *