సిరా న్యూస్, చిగురుమామిడి:
దళితుల స్మశానవాటిక ధ్వంసం…
-నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల డిమాండ్
– పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలోని దళితులు అనాదికాలం నుండి ఉపయోగిస్తున్న స్మశాన వాటికను శుక్రవారం కొందరు వ్యక్తులు జెసిబితో ధ్వంసం చేశారు. గ్రామంలోని 295 సర్వే నంబర్ లో గల భూమిలో దళితులు ఏండ్లుగా చనిపోయిన వ్యక్తుల దహన సంస్కారాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన కొంతమంది ఈ భూమి తమదేనంటూ శుక్రవారం హంగామా చేశారు. ఏకంగా జెసిబి తీసుకొచ్చి స్మశాన వాటికను పూర్తిగా ధ్వంసం చేశారు. మొక్కలు చెట్లు తొలగించడంతో, శవాల అస్తికలు బయటపడ్డాయి. ఈ ఘటనపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. స్థానిక నాయకులతో కలిసి దళితులు స్మశాన వాటికకు పరిశీలించారు. ఏళ్లుగా స్మశాన వాటిక కోసం తాము వినియోగిస్తున్న భూమిని కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జెసిబి యజమానితోపాటు స్మశాన వాటికను ధ్వంసం చేసిన నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.