సిరా న్యూస్, ఆదిలాబాద్:
కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి…
+ బీజీపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి
+ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కరపత్రాల పంపిణీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన బిజెపి నాయకులతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారంతో కూడిన కరపత్రాలను జిల్లా కేంద్రంలోని విద్యానగర్, భుక్తాపూర్ కాలనీలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో వ్యాపారస్తులకు, ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు, యువకులు, సామాన్య ప్రజలు ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. మూడోసారి సైతం కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని, నరేంద్ర మోడీ ప్రధానిగా మూడోసారి పగ్గాలు చేపట్టడం తథ్యమని అన్నారు. ప్రజలంతా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి బలపరిచే అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించే విధంగా ప్రచార రథాలు ఏర్పాటు చేసిన నిర్మల్ జిల్లా బైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబును ఆయన అభినందించారు. ఈసారి పార్టీ ఆదేశిస్తే ఆదిలాబాద్ ఎంపీ బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్న జాదవ్ రాజేష్ బాబుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జాదవ్ విజయ్, శ్రీకాంత్ రెడ్డి, రవి, శ్రీను తదితరులు ఉన్నారు.