సిరా న్యూస్, భోరజ్: (ఆకునూరు గణేష్, రిపోర్టర్)
ఐడియా అదుర్స్… చేన్లో సోలార్ సిసి కెమెరా…
+ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న అన్నదాతలు
ఇండ్లలో సీసీ కెమెరాలు, ఇంటర్నెట్ వినియోగం నేడు సాధారణంగా మారినప్పటికీ కూడా వ్యవసాయ క్షేత్రాల్లో సీసీ కెమెరాల వాడకం అరుదుగానే కనిపిస్తుందని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ని వ్యవసాయ క్షేత్రాల్లో యాంత్రీకరణ జోరుగా కొనసాగుతున్నప్పటికీ కూడా టెక్నాలజీ వినియోగం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. వ్యవసాయ కూలీలు, పాత కాలం పనిముట్లు, ఎడ్లకు బదులుగా రైతులు ట్రాక్టర్లు, స్పింక్లర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, హార్వెస్టింగ్ యంత్రాలను విరివిగా వినియోగిస్తున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం నిరాల గ్రామానికి చెందిన బోల్లు రాజ్ కుమార్ అనే రైతు మాత్రం టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందంజలో నిలుస్తున్నాడు. తన చేన్లో ఏకంగా 360 డిగ్రీ సోలార్ సిసి కెమెరా అమర్చి ఔరా అనిపిస్తున్నాడు. సూర్యరష్మితో పనిచేసే ఈ సీసీటీవీ డివైస్ లో ఒక సిమ్ వేయడం ద్వారా ఇంటర్నెట్ తో కనెక్ట్ అవుతుంది. తద్వారా ఫోన్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఎక్కడి నుండైనా సీసీటీవీ దృశ్యాలను చూసే వెసులుబాటు ఉంది. వ్యవసాయ క్షేత్రంలో అమర్చిన ఈ సీసీటీవీ, చుట్టూ తిరుగుతూ పరిసరాల్లో జరుగుతున్న దృశ్యాలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడమే కాకుండా సెల్ ఫోన్ కు పంపిస్తుంది. ఈ కెమెరా ముందు ఎవరైనా వచ్చినా… ఏదైనా అలజడి జరిగినా… వెంటనే దృశ్యాలను రికార్డ్ చేయడం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. దీంట్లో నైట్ రికార్డింగ్ మోడ్ ద్వారా రాత్రి వేళలలో సైతం నాణ్యమైన వీడియోలు రికార్డ్ చేసే అవకాశం ఉంది. కరెంట్ అవసరం లేకుండా పనిచేసే ఈ సిసి కెమెరా వలన చెన్లో ఉంచిన విలువైన పనిముట్లు, పంట ఉత్పత్తులను దొంగల బారి నుండి కాపాడటమే కాకుండా, కూలీల కొరత కూడా అదిగమిస్తున్నట్లు రైతు చెబుతున్నాడు. ఈ సీసీటీవీ ని చూసిన వారంతా వాటెన్ ఐడియా అంటూ రైతును అభినందిస్తున్నారు…