సాగునీరు విడుదల చేసి తమను ఆదుకోవాలని రోడ్డెక్కిన రైతులు

రోడ్డుకు ఇరువైపులా భారీగా నిలిచిపోయిన వాహనాలు
ఎస్సార్ఎస్పి ఈఈ బలరాం హామీతో ఆందోళన విరమించిన రైతులు
 సిరా న్యూస్,మంథని;
సాగునీరు విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరుతూ మంథని, మల్లేపల్లి గ్రామాలకు చెందిన రైతన్నలు రోడ్డు ఎక్కారు. దీంతో రోడ్డు కిరువైపులా భారీగా వాహనాలు ఎక్కడివి అక్కడ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ శివారులోని మంథని – గోదావరిఖని ప్రధాన రహదారి పై మంగళవారం సాగునీటి కోసం రైతులు సుమారు గంటపాటు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట చేతికొచ్చే దశలో నీరు లేక తమ పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే తమ పంట పొలాలకు ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. గోదావరి నది ద్వారా గుండారం చెరువుకు త్రాగునీరు, సాగునీరు అందుతుంది. కమాన్ పూర్,రామగిరి, ముత్తారం, మంథని మండలాల గొలుసుకట్టు చెరువులకు ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా సాగునీరు అందిస్తారు. కానీ మంథని మండలం కు వచ్చేసరికి గుండారం నుండి మంథని వరకు ఎస్ఆర్ఎస్పి కెనాల్ పై మోటార్లను ఏర్పాటు చేసి కొందరు రైతులు సాగునీరు వాడుకోవడంతో ఈ సంవత్సరం నీటి ఎద్దడి వల్ల దిగువ ప్రాంతం అయిన మంథని రైతులకు ఎస్ఆర్ఎస్పీ కేనాల్ ద్వారా సకాలంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ కెనాల్ పైన ఉన్న మోటార్లను తొలగించాలని అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదంటూ మంథని, మల్లెపల్లి రైతులు మంథని గోదావరిఖని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి మండిపడ్డారు. ఎండిపోయిన వరి కోయ్యలతో మందు డబ్బాలతో రైతులు ధర్నా చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సకాలంలో మంథని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకటకృష్ణలు సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడిన రైతులు శాంతించలేదు. వాహనాలు బాగా నిలిచిపోయాయని వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నదని మంథని సిఐ రైతులకు దండం పెట్టిన రైతులు వినకపోగా తమ బాధలు పట్టించుకోవాలని రైతులు మోకరిల్లారు. సాగునీరు ఇవ్వాలంటూ రైతులు పోలీసుల కాళ్లు పట్టుకోబోతుంటే, నీళ్లు వస్తాయాంటే నేను మీకాళ్లు పట్టుకుంటా అంటూ మంథని సీఐ వెంకటేశ్వర్లు రైతులతో అన్నారు.చివరికి ఎస్ఆర్ఎస్పి ఈఈ బలరాం రైతుల వద్దకు వచ్చి ఎస్ఆర్ఎస్పి కెనాల్ లో పెట్టిన మోటార్లను తొలగించి దిగువ ప్రాంతానికి నీరు వచ్చే విధంగా సహకరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *