సిరా న్యూస్;
ఒక వైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మరోవైపు, మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్ యుద్ధం.. ఇక, ఆసియాలో నార్త్ కొరియా, చైనాల రెచ్చగొట్టే చర్యలు.. ఇన్ని ఉద్రిక్తతల మధ్య మూడో ప్రపంచ యుద్ధం తప్పదేమో అనుకునే టైమ్‌లో అమెరికాలో ట్రంప్‌కు పెద్దన్న సీటు దక్కింది. తన విక్టరీ మెసేజ్‌లో కూడా నేను యుద్ధాలు చేయడానికి రావట్లేదు యుద్ధాలు ఆపేది నేనే అంటూ ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే, తన ప్లాన్ ఏంటో ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదుమళ్లీ అధికారంలోకి వస్తా.. యుద్ధాలు ఆపేస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానాల మోతమోగించారు డొనాల్ట్ ట్రంప్. నిజానికి, ట్రంప్ గెలుపులో వార్ డీల్ కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో యుద్ధాలు జరగాలని ఎవ్వరూ, ఏ దేశమూ కోరుకోవట్లేదు. ముఖ్యంగా, అమెరికన్లు శాంతి కావాలని ఆందోళనలు కూడా చేపట్టారు. బైడెన్ ప్రభుత్వం యుద్ధాల విషయంలో తీసుకున్న నిర్ణయాలతో అసహనానికి గురైన అమెరికన్లు, ఎన్నికలకు ముందు భారీగా నిరసనలు చేశారు.ట్రంప్ విజయంలో మస్క్ పాత్రను పక్కన పెడితే.. అమెరికన్లలో పెరిగిన అసంతృప్తి కూడా డెమొక్రాటిక్ పార్టీ పరాజయానికి కారణం అయ్యింది. యుద్ధాన్ని ఆపుతానని చెప్పిన ట్రంప్ గెలిచారు. ఇక, అమెరికా విదేశాంగ విధానంలో భారీగా మార్పులు చేయాలని మొదటి నుంచి చెబుతున్న ట్రంప్.. వలసలు, వ్యాపారం, ఆర్థిక, సైనిక వ్యహారాల్లో విధానపరమైన ఛేంజస్ తీసుకొచ్చే పనితో పాటు… ముఖ్యంగా, యుద్దాలను ఆపడాన్ని కీలకంగా పరిగణించారు. కేవలం 24 గంటల్లోనే రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని మాట ఇచ్చారు. విజయం సాధించాక ట్రంప్ ఇచ్చిన స్పీచ్‌లో.. కొత్తగా యుద్ధాలు స్టార్ చేయను.. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను ఆపుతానని చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, యుద్ధాలు వంటి అంశాల్లో ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటారనడంలో సందేహం లేదు. స్పష్టమైన వివరాలు చెప్పకపోయినా, ట్రంప్ విదేశాంగ విధానం గురించి ప్రపంచానికి అనుభవం ఉంది. గత ట్రంప్ అధికారంలో అమెరికా శత్రు దేశాలైన రష్యాతో పాటు చైనా, నార్త్ కొరియాలకు కూడా ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే, ఎన్ని షేక్ హ్యాండ్‌లు, ఎన్ని హ్యాండ్‌లు ఇచ్చినా.. అమెరికాకు ‘అమెరికా ఫస్ట్’ అనేది మాత్రమే అత్యంత ముఖ్యమైన విదేశీ విధానం. అందుకే, 2017 నుంచి 2021 మధ్య కాలంలో ట్రంప్ పాలన.. ఇటీవల, ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిన మాటల ఆధారంగా ట్రంప్ విదేశాంగ విధానంపై ఎలా ఉండబోతుందనేది కొంత అంచనా వేయొచ్చు. ముఖ్యంగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపడంలో ఏం చేస్తారన్నది ఊహించొచ్చు.రష్యాతో శాంతి చర్చలకు రావాలనే షరతుతోనే ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలు సరఫరా చేయాలన్నది గతంలో ట్రంప్ డిమాండ్. దీనితో పాటు, శాంతి చర్చలకు పుతిన్‌ను ఒప్పించాలంటే.. ఉక్రెయిన్‌ను నాటో కూటమిలో చేర్చుకోమని యూరప్ దేశాలు కచ్ఛితంగా చెప్పాల్సి ఉంది. అలాగే, రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాన్ని తిరిగి ఉక్రెయిన్‌కు అప్పగించాలి. ఇందులో భాగంగా, ప్రస్తుతం ఫ్రంట్ లైన్స్ ఆధారంగా చర్చలు జరపాల్సి ఉంది. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తనకున్న స్నేహం, మస్క్‌తో ఉన్న బిజినెస్ డీలింగ్ కారణంగా ఉక్రెయిన్ లొంగిపోవాలనే విధంగానే ట్రంప్ డీల్ చేసే అవకాశం ఉంది. అయితే, ఇది యూరప్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తుందనడంలో సందేహం లేదు. దీనికి, ఉక్రెయిన్ కూడా ఒప్పుకునే ఛాన్స్ తక్కువే.అయితే, యుద్ధం ఆపేయడానికి ‘అమెరికా ఫస్ట్’ అనే ట్రంప్ విధానం నాటో భవిష్యత్‌కు సంబంధించి వ్యూహాత్మక సమస్యలకు దారితీస్తుందని నిపుణులు ఇప్పటికే సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన వివిధ దేశాల సైనిక కూటమే ఈ నాటో. అయితే, అమెరికా డబ్బులతో యూరప్ దేశాలు ఉచితంగా రక్షణ పొందుతున్నాయని నాటో కూటమిపై ట్రంప్ చాలా సార్లు విమర్శలు గుప్పించారు. అందుకే, నాటో కూటమి నుంచి అమెరికా బయటకొచ్చే విధంగా ట్రంప్ చర్యలు ఉంటాయనే వాదన కూడా ఉంది.ఇక, ఇదే జరిగితే, ఈ వందేళ్ల కాలంలో అట్లాంటిక్ దేశాల మధ్య రక్షణకు సంబంధించిన సంబంధాల్లో ఇదో కీలక మార్పును తెస్తుందనడంలో సందేహాం లేదు. అయితే, ట్రంప్ వ్యూహంలో నాటో కూటమి నుంచి వైదొలగే అంశం ఉండదన్నది బలంగా వినిపిస్తున్న మాట. ఇది నిజయం కూడా. అందుకే, రక్షణ వ్యవహారాల్లో సభ్య దేశాలు కేటాయించే నిధుల వాటాల్లో మార్పులు తీసుకురావడం వరకే ట్రంప్ మార్పులు చేసే అవకాశం ఉంది. దీనితో, యూరప్ దేశాల్లో అసంతృప్తి వచ్చినప్పటికీ, ఉక్రెయిన్‌కు సహాయం అందించడంలో వాటిని కాస్త దూరం చేయడంలో ట్రంప్ విజయం సాధిస్తారు. ఈ పరిణామం వల్ల, నాటో దేశాలపై ఆధారపడిన ఉక్రెయిన్ బలవంతగానైనా యుద్ధం నుండి విరమించుకోవాల్సి వస్తుంది.ఇక, పశ్చిమాసియాలోనూ శాంతిని నెలకొల్పుతానని ట్రంప్ హామీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తుంది. గాజాలో ఇజ్రాయెల్-హమాస్, లెబనాన్‌లో ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య యుద్ధాలను ఆపేస్తానని ట్రంప్ మాట ఇచ్చారు. కానీ, ఎలా చేస్తారన్నది చెప్పలేదు. ఒకవేళ జో బైడెన్ స్థానంలో ట్రంప్ అధికారంలో ఉండుంటే.. హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి సాహసించేది కాదని ట్రంప్ చాలా సార్లు అన్నారు. ఎందుకంటే, హమాస్‌కు నిధులు చేకూర్చే ఇరాన్‌పై ఒత్తిడి తీసుకువచ్చేవాడినని ఆయన తెలిపారు.ఇవన్నీ చూస్తుంటే, తిరిగి పాత ఒప్పందాల వైపు ట్రంప్ మొగ్గుచూపుతున్నారని అర్థమవుతోంది. అంటే, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొగలడం, ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించడం, ఆ దేశానికి చెందిన అత్యంత శక్తిమంతమైన సైనిక కమాండర్ జనరల్ సులేమానీని చంపడం వంటి ఇజ్రాయెల్ అనుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, ట్రంప్ మొదటి హయాంలో కూడా ఇజ్రాయెల్‌కు అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను గుర్తించి యూఎస్ రాయబార కార్యాలయాన్ని అక్కడికి మార్చారు ట్రంప్.ఇక, ఇప్పటి వరకు వైట్‌హౌస్‌లో ఇజ్రాయెల్‌కు దొరికిన బెస్ట్ ఫ్రెండ్ ట్రంప్ అని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా తెగ సంబరపడ్డారు. అయితే, ట్రంప్ విధానాలతో మిడిల్ ఈస్ట్‌లో అస్థిరత నెలకొందని కొందరు విమర్శకులు అంటున్నారు. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను గుర్తించడమే ట్రంప్ పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారనడానికి నిదర్శనమని వాదిస్తున్నారు.ఈ వాదనకు బలం చేకూరుస్తూ.. గతంలో ఇజ్రాయెల్‌కు ఇతర అరబ్, ముస్లిం దేశాల మధ్య దౌత్య సంబంధాలు పెంపొందించడానికి ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారు. ఇజ్రాయెల్ అధికారాన్ని గుర్తించినందుకు ఆయా దేశాలకు అధునాతన అమెరికా ఆయుధాలు కూడా లభించాయి. దీని వల్లే, మిడిల్ ఈస్ట్‌లో పాలస్తీనా మరింత ఒంటరైందన్నది కొందరి అభిప్రాయం. గతం ఎలా ఉన్నా.. ట్రంప్ మాత్రం గాజాలో యుద్ధం ముగిసిపోవాలని కోరుకుంటున్నట్లు తన ఎన్నికల ప్రచారంలో అనేక సార్లు చెప్పారు.హమాస్‌తో సంబంధాలున్న అరబ్ దేశాలతోనూ ట్రంప్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఒక వైపు గాజాలో యుద్ధానికి ఆపడానికి ప్రయత్నిస్తూనే.. మరోవైపు, ఇజ్రాయెల్ నాయకత్వాన్ని ట్రంప్ ఎలా బలపరుస్తారు అన్నది అస్పష్టంగానే ఉంది. ఇక, హమాస్ చేతిలో ఉన్న బందీల విడుదలకు బదులుగా గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి జో బైడెన్ హయాంలో చేసిన ప్రయత్నాలను ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్నది ట్రంప్ నిర్ణయించాల్సి ఉంది.ఏది ఏమైనప్పటికీ, ట్రంప్ వార్ డీల్, రానున్న కాలంలో అంతర్జాతీయ సంబంధాల్లో కీలక మార్పులకు కారణమవుతుందనడంలో సందేహం లేదు. ఇక, ఇది ట్రంప్‌కు అమెరికా ప్రెసిడెంట్‌గా చివరి అవకాశం. ఆయన బ్యాలెన్స్ లేకుండా తీసుకునే ప్రతి నిర్ణయం, తదనంతరం మరిన్ని ఉద్రిక్తతలకు బీజాలు వేయకుండా ఉండాలి. మరి, ట్రంప్ అలాంటి నిర్ణాయాలు తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.