విశాఖపట్టణం, (సిరా న్యూస్);
ఉదయాన్నే స్కూల్ కి వెళ్ళాలి. యూనిఫామ్ వేసుకుని పుస్తకాలు పట్టుకొని బయలుదేరాలి. కాస్త సమయం ఆలస్యమైతే స్కూల్లో గేట్లు మూసుకుపోతాయి. దీంతో హడావుడిగా వెళ్లాల్సిన పరిస్థితి..! ఈ నేపథ్యంలో కొంతమంది దగ్గరున్న పాఠశాలలకు టూవీలర్లపై, మరికొంత మంది నడుచుకుని వెళుతున్నారు. ఇంకొంతమంది బస్సులో బయలుదేరుతున్నారు. చాలామంది స్కూళ్లకు ఆటోల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడే వస్తుంది అసలు సమస్య..! పరిమితికి మించి విద్యార్థులు.. వాటికి స్కూలు బ్యాగులు అదనం. కొన్ని ఆటోల్లో అయితే డ్రైవర్ పక్కన కూడా విద్యార్థులను కూర్చోబెట్టుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.విశాఖలో ఒకేరోజు జరిగిన రెండు వేర్వేరు స్కూలు ఆటో ప్రమాదాలతో.. నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దృశ్యాలు చూసిన వారంతా గుండెలు పట్టుకున్నారు. అదృష్టవశాత్తు ప్రాణపాయం ఏది సంభవించనప్పటికీ.. ఆ ప్రమాద తీవ్రత చూసి అందరూ భీతిల్లిపోయారు. చకచకా బడికి వెళ్లాల్సిన విద్యార్థులు ఇలా ఆటో ప్రమాదాల్లో చిక్కుకొని.. గాయాలతో నడిరోడ్డుపై ఆహాకారాలు చేస్తున్న ఘటనలు అందరినీ కలచివేశాయి.పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లడం.. డ్రైవర్లు కంట్రోల్ చేయలేక యాక్సిడెంట్లు గురై విద్యార్థులు గాయాల పాలనట్టు పోలీసులుగుర్తించారు. ఈ ప్రమాదాలతో అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు