-శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రత్యేక భద్రతా బలగాలను ఏర్పాటు చేయాలి
-మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
– మంథని,(సిరా న్యూస్);
మంగళవారం రాత్రి కిష్టాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ముత్తారం మండలం ఓడేడు గ్రామ సర్పంచ్ సిరికొండ బక్కారావు, ఆయన భార్య పద్మపై కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హత్యాయత్నం చేయడాన్ని ఏఐసీసీ కార్యదర్శి. తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్ధిల్ల శ్రీధర్ బాబు ఖండించారు.
బుధవారం మంథని అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ర్యాలీగా వెళ్లి మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతరం మంథని ఆర్డీవో కార్యాలయం ముందు శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ ఘటనలో బక్కారావు కు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం అతడి ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు.రాబోయే ఎన్నికల్లో మా పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తే మా పార్టీ నేతలు, క్యాడర్‌పై దాడులు చేస్తామని బెదిరించారన్నారు. ఈ విషయంలో, ఎన్నికల సమయంలో ప్రచారం చేయడానికి నియోజకవర్గంలో స్వేచ్ఛాయుతమైన వాతావరణం లేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. మిగిలిన పోటీ అభ్యర్థులను బెదిరించడం బిఆర్ఎస్ పార్టీ నాయకులకు పరిపాటిగా మారిందని ఆయన తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి అతని అనుచరులు నా క్యాడర్‌ను నాయకులను భౌతికంగా చంపుతామని బెదిరించడం ద్వారా భయాందోళన పరిస్థితులను సృష్టించే అవకాశం ఉందన్నారు, ఇది ఎన్నికల శాంతియుత రాజకీయ ప్రక్రియను నాశనం చేస్తుందన్నారు. ఇక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మంథని నియోజకవర్గాన్ని సున్నితమైన ప్రాంతంగా పరిగణించి, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రత్యేక భద్రతా బలగాలను ఏర్పాటు చేయాలన్నారు. తమ మనస్సాక్షి ప్రకారం ఓటు వేస్తామన్న విశ్వాసాన్ని ఓటర్లలో పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఏఐసీసీ సెక్రెటరీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్కొన్నారు.