-జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్
-కౌంటింగ్ ఏజెంట్లకు, సిబ్బందికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలి
-మంథని జేఎన్టీయూ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
మంథని, (సిరా న్యూస్);
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేందుకు అవసరమైన సకల ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
మంగళవారం రామగిరిలోని సెంటినరీ కాలనీలో ఉన్న జేఎన్టీయూ మంథని కళాశాలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి పరిశీలించి కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని, పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గం కౌంటింగ్ జేఎన్టీయూ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
కౌంటింగ్ కు హాజరయ్యే సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ నిర్వహణ కోసం అవసరమైన బారీకేడ్లను ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ భవనం ఆవరణలో గ్రౌండ్ లెవెలింగ్ చేయాలని, నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ ఏజెంట్లు వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ప్రతి ఒక్కరికి నిర్దేశించిన మార్గాలను సూచిస్తూ అవసరమైన చోట్ల సూచిక బ్యానర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.