నిజామాబాద్, (సిరా న్యూస్);
మాట పొదుపుగా వాడాలి.. నోరు అదుపలో ఉండాలి అంటారు పెద్దలు. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో వారు అనుభవంలో తెలుసుకున్నారు కాబట్టే దానిని ఒక నానుడిగా భవిష్యత్తు తరాలకు తెలిసే విధంగా తెరపైకి తీసుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు రాజకీయ నాయకులు ఆ నానుడిని అనుభవంలోకి తీసుకు రాలేకపోతున్నారు. ఫలితంగా అది జనాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలో రాజకీయ నాయకులు పరుష పదజాలం వాడటం సర్వసాధారణమైపోయింది. ఒకప్పుడు కేవలం విధానపరంగానే విమర్శలు చేసుకునేవారు. రాను రాను అది అదుపుతప్పుతోంది.. ఏకంగా రాజకీయాల్లోకి ఇంట్లో మనుషులను కూడా తీసుకురావడం పరిపాటిగా మారిపోతోంది. దీనికి తోడు రాయకూడని భాషలో విమర్శలు చేసుకుంటుండడం వల్ల అది సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది.ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వాతావరణం తారస్థాయికి చేరింది. అధికార పక్షం, ప్రతిపక్ష నాయకులు పోటాపోటీగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ విధానపరమైన విమర్శలు చేసుకుంటే అందరికీ బాగానే ఉండేది. కానీ అది విధానపరాన్ని మించిపోయి వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్థాయికి దిగజారింది. ఇదే సమయంలో నాయకుల నోరు అదుపుతప్పుతుండడంతో దాని పర్యవసనాలు అదే స్థాయిలో ఉంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి వరకు ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. తమలపాకుతో నేను ఒకటి ఇస్తే, తలుపు చెక్కతో నేను రెండు ఇస్తా అనే సామెత తీరుగానే నేతల వ్యవహార శైలి ఉంటున్నది. కేవలం బహిరంగ సమావేశాలోనే కాదు.. సామాజిక మద్యమాలను కూడా నేతలు వదిలిపెట్టడం లేదు. తమ నోటి దుగ్దను తీర్చుకోవడానికి వాటిని కూడా వదిలిపెట్టడం లేదు.ఇక నాయకుల తీరు ఇలా ఉంటుంటే.. కార్యకర్తల వ్యవహార శైలి మరింత తీవ్రంగా ఉంటోంది.. నాయకులను మించి కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నారు. వ్యక్తిగత విషయాలలో కూడా వేలు పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. ఇప్పుడు ఇక సోషల్ మీడియా కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం, అందులో కృత్రిమ మేథ మరింత చేరువ కావడంతో కార్యకర్తల ఆగడాలకు అంతు పొంతు లేకుండా పోతున్నది. సన్నాసి నుంచి మొదలు పెడితే ర** అనే మాటలు సర్వసాధారణమైపోతున్నాయి. ఇక కార్యకర్తల తీరిలా ఉంటే.. మీడియా ధోరణి మరోరకంగా ఉంటున్నది.