సిరా న్యూస్;
-నేడు ఆయన వర్ధంతి
‘ప్రాచీనత’, ‘ఆధునికత’ సంధియుగంలో జన్మించాడు గురజాడ అప్పారావు.తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ. నేడు కవి శేఖరడి వర్ధంతి . విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో 1862 సెప్టెంబర్ 21 అప్పారావు జన్మించాడు. తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. ఉపాధ్యాయుడిగానూ, డిప్యుటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్క్లర్కుగానూ, విజయనగరం రాజు ఆస్థానంలోనూ, అధ్యాపకుడిగానూ పనిచేసిన గురజాడ- తొలుత ఆంగ్లంలో రాసినప్పటికీ, తర్వాత తెలుగులోకి మరలాడు. స్నేహితుడు గిడుగు రామ్మూర్తితో కలిసి వ్యావహారిక భాషోద్యమానికి నడుం బిగించాడు. విజయనగర కేంద్రంగా జరిగే ‘కన్యాశుల్కము’ నాటకంలో అక్కడి యాస భాషను ప్రవేశపెట్టాడు. పెద్ద కుటుంబాలనుంచి వచ్చినవారే నాయికానాయకులుగా సాహిత్యాన్ని ఆక్రమించుకుంటున్న కాలంలో వేశ్య మధురవాణిని నాయికను చేశాడు. వేశ్యావృత్తిని నిర్మూలించాలంటే, ముందుగా వేశ్యలను కూడా మనుషులుగా చూడటం అవసరమన్నాడు. గురజాడ. 20వ శతాబ్ది తొలినాళ్ళలో జరిగిన వ్యవహారిక భాషోద్యమంలో గురజాడ అప్పారావు తన సహాధ్యాయి గిడుగు రామమూర్తి పంతులుతో కలిసి పోరాటం జరిపారు. వారిద్దరూ కలిసి పత్రికల్లో, సభల్లో, మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాంథిక భాషావాదులతో పోరాడారు. 1913లో అప్పారావు పదవీ విరమణ చేసారు. 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గురజాడ అప్పారావు మరణించారు