హైదరాబాద్, (సిరా న్యూస్);
వాళ్ళంతా చదువుకున్న వారే, పొద్దున నుండి రాత్రి వరకు ఉరుకు – పరుగుల జీవితాలు. వాళ్ళదంతా సిటీ కల్చర్ – రాజకీయాలు, రాజకీయ నాయకుల పై విశ్లేషణ చేస్తారు. కానీ ఓటు మాత్రం వేయరు. ఈసారి జరిగే ఎన్నికల్లో అర్బన్ ప్రజలతో ఓటు వేహించాలని టార్గెట్ గా పెట్టుకుంది ఎలక్షన్ కమిషన్. ఇందులో ఐటీ సెక్టార్ ఉద్యోగులే ఎక్కువ. మరి ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చి ఎన్నికల సంఘం ట్రెండ్ సెట్ చేస్తుందా..? లేదా అనేదీ చర్చనీయాంశం.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 73.20% పోలింగ్ నమోదైంది. 1983 నుంచి 2018 వరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే అత్యధిక పోలింగ్ శాతం. 1983 నుంచి జరిగిన 9 ఎన్నికల్లో సాధారణ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే సగటున 67.57% పోలింగ్ నమోదైంది. ఈ సారి అత్యధిక పోలింగ్ శాతం నమోదవుతుందనే అంచనాలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3.26 కోట్ల ఓటర్లు ఉన్నారు.ఈసారి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేశారు. చనిపోయినవారి పేర్లు తొలగించడం, ఒకటికి మించిన నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించి వారి కోరిక మేరకు ఏదో ఒకచోటనే ఓటర్ల జాబితాలో పేరు ఉంచి, మిగతా చోట్ల తొలిగించడం లాంటి చర్యలు చేపట్టారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అనర్హుల ఓట్లను తొలిగించారు. దీనికితోడు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా పోలింగ్ శాతం పెంపుదలపై దృష్టి సారించారు. దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వారికి ఇంటి వద్దనే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు.