సిరా న్యూస్,హైదరాబాద్;
నెల రోజుల పాటు ప్రచారంతో హోరెత్తిన వీధులు నిశబ్దంగా మారిపోయాయి. తెలంగాణ ఓటర్లు గురువారం ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా.. 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసింది. భద్రత పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు రానున్నాయి.తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది బీజేపీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, మంత్రులు ప్రచారం చేశారు. ఇక రాష్ట్రం నుంచి బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, తీన్మార్ మల్లన్న ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రచారం చేశారు. బీఎస్పీ తరుఫున మాయవతి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం చేశారు.ఎన్నికల ప్రచారం ముగియడంతో మంగళవారం సాయంత్రం నుంచే అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిజర్వ స్థానాల్లో కాకుండా జనరల్ స్థానాల్లో భారీగా డబ్బులు ఖర్చ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఇస్తుండగా.. కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు రూ.5 వేల వరకు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల సంఘం ప్రలోభలపై దృష్టి పెట్టింది. డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా చర్యలు తీసుకోనుంది.