రాజేంద్రనగర్,(సిరా న్యూస్);
రాజేంద్రనగర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారానికి మరో ఒక్కరోజు మాత్రమే గడువు మిగిలి ఉండడంతో ప్రచారంలో దూకుడును పెంచిన ఆయన గల్లీ గల్లీలో ప్రచారాన్ని ఉధృతం చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి, తొండుపల్లి, ఊటుపల్లి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన తోకల శ్రీనివాస్ రెడ్డి రోడ్ షో ద్వారా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి యువనేత ప్రవీణ్ ఆధ్వర్యంలో తోకల శ్రీనివాస్ రెడ్డికి అపూర్వ రీతిలో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గొల్లపల్లిలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన తోకల శ్రీనివాస్ రెడ్డి…. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి స్థానిక ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని మాట తప్పారని రాజేంద్రనగర్ బీజేపీ అభ్యర్ది తోకల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అలాంటి వ్యక్తికి మరోసారి ఓటు వేయాల్సిన అవసరం ఉందా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. యువకుడు విద్యావంతుడు అయిన తనకు ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే గొల్లపల్లి ప్రజల ఇళ్లస్థలాల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానని తోకల శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. మరోవైపు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఊటుపల్లిలో స్థానిక కౌన్సిలర్ కొండా ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో తోకల శ్రీనివాస్ రెడ్డి రోడ్ షోకు ఘనంగా స్వాగతం పలికారు