తాడేపల్లిగూడెం,(సిరా న్యూస్);
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం గ్రామంలో ఈనెల 27 నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు శ్రీ భక్తాంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసంలో బుధవారం ఈ మహా కృతువుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి కొట్టు వెంకటేశ్వరరావు 62 సంవత్సరాల క్రితం గోపీనాథ పట్నం గ్రామంలో ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలతో ఆలయాన్ని తీర్చిదిద్దారన్నారు. కళ్యాణ మండపం, గీతా మందిరం, రామకోటి కృతువు, భగవత్ సంబంధిత విగ్రహాలు ఏర్పాటు చేసి ఆలయాలను నిర్మించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారని వివరించారు. దానిని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాతి కట్టడంతో ఆలయం నిర్మాణం చేపట్టామని మంత్రి కొట్టు చెప్పారు. కొన్ని వందల సంవత్సరాలు పాటు చెక్కు చెదరకుండా పదిలంగా ఉండేలా రాతి కట్టడంతో ఆలయాన్ని నిర్మించామన్నారు. తమ తల్లిదండ్రులు కీర్తిశేషులు కొట్టు వెంకటేశ్వరరావు, సరస్వతి పుణ్య దంపతుల దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలియజేశారు