ఏపీలో పోలీసుల పల్లెనిద్ర     

సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్‌ లో మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి పోలీసు శాఖ ను సిద్ధం చేస్తోంది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యరక్షణపై దృష్టి పెట్టి… పోలీసు అధికారుల పల్లె నిద్ర పేరుతో కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమంతో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేకంగా నిఘా పెంచుతోంది జగన్‌ సర్కార్‌.పల్లె నిద్ర.. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు చేయడం మాత్రమే చూశాం. గ్రామాల్లో సమస్యలను తెలుసుకునేందుకు… గ్రామస్తులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు పొలిటికల్‌ లీడర్లు పల్లె నిద్ర కార్యక్రమం చేపడూ ఉంటారు. కానీ ఎప్పుడైనా పోలీసులు పల్లె నిద్ర అనే కార్యక్రమం చేశారా..? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. పల్లెనిద్ర కార్యక్రమంలో… సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచడం.. శాంతి భద్రతలను పరిరక్షించడమే పనిగా పెట్టుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు చేపడుతున్న ఈ పల్లె నిద్ర కార్యక్రమంలో… ఎస్సై స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు రోజుకో పల్లెలో గ్రామ సభ నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు ఆ గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యను తెలుసుకుంటారు. ఆయా గ్రామాల్లో అసాంఘిక శక్తులు ఉంటే గుర్తిస్తారు. వారికి కౌన్సిలింగ్‌ ఇస్తారు. అంతేకాదు.. గ్రామాల వారీగా డేటా సేకరించి… ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. దీని వల్ల.. పోలీసులు, ప్రజల మధ్య ఉన్న సమన్వయం ఏర్పడుతుందని చెప్తున్నారు. పల్లె నిద్ర కార్యక్రమం కోసం ఏపీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సిద్ధమవుతోంది. ఇందుకు చిత్తూరు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. పోలీసు స్టేషన్ల వారీగా పల్లె నిద్రకు గ్రామాలను గుర్తిస్తారు. ఆ లిస్ట్‌ ఆధారంగా… ఆయా గ్రామాల్లో ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులు పల్లె నిద్ర చేపడతారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల కదలికలను పసిగడతారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గ్రామస్తులకు వివరిస్తారు. దీంతో పాటు జైలు నుంచి విడుదలై వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెడతారు పోలీసులు. గ్రామంలోని స్థానికేతరుల కదలికలపై కూడా నిఘా ఉంచుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *