కాంగ్రెస్ …. ఆశలు ఫలించేనా…

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈసారి హై హోప్స్ పెట్టుకుంది. మూడు నెలల క్రితం వరకూ కొంత స్తబ్దుగా ఉన్న పార్టీ ఒక్కసారిగా ముందుకు వచ్చింది. పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కొనసాగేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది తెలంగాణ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ ఆచితూచి అడుగులు వేసింది. అసంతృప్తులు అక్కడక్కడా కనిపించినా.. కీలక నేతలు బయటకు వెళ్లిపోయినా టిక్కెట్లను కొంత ఆలస్యంగానే ఖరారు చేసింది. విడతల వారీగా టిక్కెట్ల జాబితాను విడుదల చేసి జనంలోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూడా టిక్కెట్లు ఇస్తూ ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన నేతలను గుర్తించి టిక్కెట్లను కేటాయించింది.టిక్కెట్ల కేటాయింపులో అలకలు.. అసంతృప్తులు పార్టీలో కొంత సహజమే అయినప్పటికీ అవి పెద్దగా ఈసారి ప్రభావం చూపలేదు. అధికార పార్టీపై ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించింది. వామపక్ష పార్టీలతో పొత్తులు జరిపినా ఒక్క సీపీఐతో మాత్రమే అలయన్స్ కుదుర్చుకుంది. కోదండరామ్ నేతృత్వం వహిస్తున్న తెలంగాణ జనసమితి పార్టీ మద్దతును కూడ గట్టింది. ఇందులో ఒకరకంగా విజయం సాధించినట్లే. పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలు తిరిగి రావడానికి ముఖ్యమైన నేతలు కృషి చేశారు. నేతల్లో ఐక్యత స్పష్టంగా కనిపించింది. కొట్లాటలు లేవు. గొడవలు లేవు. ఘర్షణలు లేకుండా ప్రమాదకరమైన పరిస్థితిని సులువుగా అధిగమించింది.తొలుత ఆరు గ్యారంటీలను ప్రకటించి జనంలోకి తీసుకెళ్లింది. సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున వంటి నేతల సమక్షంలో ఆరు గ్యారంటీలను విడుదల చేసింది. ఇక తర్వాత మ్యానిఫేస్టోను విడుదల చేసింది. 64 అంశాలతో రూపొందించిన మ్యానిఫేస్టో కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చర్యలు తీసుకుంది. అన్ని సామాజికవర్గాలకు అండగా ఉంటామని అభయ హస్తం పేరిట ప్రామిస్ చేశారు. అధికారంలోకి రాగానే మాట నిలబెట్టుకుంటామని, అన్ని అమలు చేస్తామని నేతలు పదే పదే చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *