సిరా న్యూస్,విజయవాడ;
యువగళం పాదయాత్రతో పొలిటికల్ సమీకరణాల్లో మార్పు రాబోతున్నాయా? వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశించే వారు లోకేశ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారా? అటు జనసేన పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ ఆశావాహులు లోకేశ్ మెప్పుకోసం ప్రయత్నాలు చేస్తున్నారా? ఈ యువగళం పాదయాత్రలో తమ అంగబలం, అర్థబలం నిరూపించుకునేందుకు పోటీ పడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో అమలాపురం మినహా రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలకు జనసేన పార్టీ ఇన్‌చార్జిలు లేరు. మరోవైపు పి.గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ తరఫున పూర్తిస్థాయిలో ఇన్‌చార్జి నియామకం కూడా జరగలేదు. దీంతో ఈ యువగళం పాదయాత్రతోనైనా ఇన్‌చార్జిల నియామకం జరిగిపోతుందని టీడీపీ భావిస్తోంది. మరోవైపు జనసేన పార్టీ తరఫున ఆశావాహులు సైతం ఈ యువగళం పాదయాత్రతోనైనా ఇన్‌చార్జిలు, అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఓ ప్రచారం జరుగుతుంది.ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు అంటేనే రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలు అని ఇప్పటికీ పేరుంది. ఈ జిల్లాల ప్రజల ఇచ్చిన తీర్పుపైనే రాజకీయ పార్టీలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ ఉభయగోదావరి జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫుల్ కాన్‌సెంట్రేషన్ పెడతాయి. ఇకపోతే ఈ ఉభయగోదావరి జిల్లాల్లో అత్యధిక నియోజకవర్గాలు ఏ పార్టీ గెలుపొందుతుందే ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది సెంటిమెంట్.