-నిబంధనల ప్రకారం కౌంటింగ్ నిర్వహణకు అధికారులు సన్నద్దం కావాలి
-ప్రతి కంట్రోల్ యూనిట్ నందు మొత్తం ఓట్ల వివరాలు ఫారం 17 సి తో సరి చూసుకోవాలి
-పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం
మంథని
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధంగా సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
శనివారం రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ పై సంబంధిత కౌంటింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ కౌంటింగ్ పరిశీలకులు రామగుండం రాజేష్ సింగ్ రానా, మంథని సి.పి. పటేల్, పెద్దపల్లి సీ.ఎన్ శ్రీధర లతో కలిసి పాల్గొన్నారు.
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ డిసెంబర్ 3న ఉదయం 8 గంటలకు జేఎన్టీయు కళాశాల బ్లాక్ 2 నందు జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభ మవుతుందని, ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని అన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ హాల్లో 14 కౌంటింగ్ టేబుల్, ఒక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు టేబుల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ,మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 రిజర్వ్ బృందాలు, 3 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బృందాలు అందుబాటులో ఉంటాయని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ సమయంలో ఫారం 13ఏ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ నిబంధనల ప్రకారం చివరి రౌండ్ లెక్కింపు ప్రారంభానికి ముందు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ కు ముందస్తుగా కంట్రోల్ యూనిట్ లను హమాలీలు తీసుకుని వస్తారని, ప్రతి 2 టేబుళ్ళకు ఒక హమాలీ ఉంటారని, వారికి డ్రెస్ కోడ్ ఉంటుందని, ప్రతి టేబుల్ వద్ద వారికి కేటాయించిన కంట్రోల్ యూనిట్లు మాత్రమే చెక్ చేసి కౌంటింగ్ చేయాలని అన్నారు.
కంట్రోల్ యూనిట్ లెక్కింపు ప్రారంభానికి ముందు కంట్రోల్ యూనిట్ లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం 17సి నందు నమోదైన ఓట్లు సరి చూసుకోవాలని, తేడా వస్తే వెంటనే సదరు కంట్రోల్ యూనిట్ ను రిటర్నింగ్ అధికారికి అప్పగించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
కంట్రోల్ యూనిట్ లో క్లాక్ ఎర్రర్ వస్తే కొత్త బ్యాటరీ వేసి ఆన్ చేయాలని, అప్పటికి క్లాక్ ఎర్రర్ వస్తే రిటర్నింగ్ అధికారికి అప్పగించాలని , కంట్రోల్ యూనిట్ లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించాలని అన్నారు.