(సిరా న్యూస్);
-నేడు ఒగ్గు కథ పితామహుడు మిద్దె రాములు వర్ధంతి
ఒగ్గు కథ అంటే మిద్దె రాములు.. మిద్దె రాములు అంటేనే ఒగ్గు కథ. ఆయున గజ్జె కట్టి ఆడితే యూవత్ తెలంగాణ ఉర్రూతలూగింది. ఆ పల్లెపదాల పాటగాడి గొంతు గట్లమీదుగా సాగి పంట పొలాలనుస్పృశించేది. తంగేడు పూలు తలలూపుతూ స్వాగతం పలికితే… పల్లెలు, తండాలు పరవశించిపోయేవి. ఒగ్గుకథ మూలవాసంగా నిలిచిన ‘మిద్దె’ నేటితరం కళాకారులకు చరిత్రగా మిగిలారు. అక్షరజ్ఞానంలేకున్నా.. ఆశుకవిగా ఆయన తరతరాలకు చెరగని సాంస్కృతిక సంపదగా నిలిచిపోయారు. గ్రామీణ ఒగ్గు కథకు అంతర్జాతీయు కీర్తిని ఆర్జిం చి పెట్టిన జానపద వైతాళికుడు ఆయున. బాల్యం నుంచేపాట…రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటకు చెందిన మిద్దె రాములు గొల్ల-కుర్మ కులస్తుడు కాకపోయినా ఒగ్గుకథకు అంకితమయ్యారు. ఒగ్గుకథకు పితామహుడిగా మన్ననలుపొందారు. నేటితరం కళాకారులకు స్ఫూర్తిగా నిలిచారు. 1942లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేట గ్రామంలో జన్మించిన మిద్దె రాములు ఐదుగురు సోదరుల్లో చిన్నవాడు.
చిన్ననాటి నుంచే ఒగ్గుకథపై మమకారం పెంచుకున్న మిద్దెరాములు స్వయంకృషితో ఒగ్గుకథను ఆకళింపు చేసుకున్నారు. ప్రదర్శనలు ఇవ్వటం మొదలుపెట్టారు.
50 ఏండ్లుగా ఒగ్గుకథ ప్రయాణంతెలంగాణ వాడుకభాషలో 50 ఏండ్లుగా ఒకే బృందంతో డోలు, తాళం, జగ్గు, కంజర వాయిద్యాలు మోగింపజేస్తూ ఎల్లమ్మకథ, బాలనాగమ్మకథ, దేశింగురాజు కథ,సారంగధరకథ, గంగగౌరీ, ఐదు మల్లెపూల కథలను ఒగ్గుకథలుగా చెప్పారు మిద్దె రాములు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇక్కడి ప్రజల భాషతో సాగే ఈ కథల మధ్యలో జానపద గేయాల్నిఆలపిస్తూ, హాస్య వ్యంగ్యోక్తులు వేస్తూ కథను రసవత్తంగా రక్తికట్టించడం రాములు అలవర్చుకున్న కళ. నిరక్షరాస్యుడైన రాములుకు తెలంగాణ భాష, పౌరాణిక గాథలపై మంచి పట్టుండేది. ప్రాచీనపురాణాలు, చారిత్రక గాథలే కాకుండా తన కథ ద్వారా సామాజిక చైతన్యాన్ని రేకెత్తించే విధంగా కథలు చెప్పడం మిద్దెరాములు ప్రత్యేకత. తెలంగాణ ఉద్యమం లో బోనం నృత్యంతో ఉర్రుతలూగించారు.అపురూపం బోనం నాట్యంతెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు నిలువెత్తు నిదర్శనం గ్రామదేవతలకు సమర్పించే బోనం. నెత్తిన బోనమెత్తుకుని వడివడిగా నడువగలడం నేర్పుతో కూడిన ఘట్టం. ఈపక్రియను తన జానపద కళారూపంగా మలుచుకున్నారు మిద్దె రాములు. ఒగ్గుకథ శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఆయన అలవోకగా బోనం ప్రదర్శన ఇచ్చేవారు. నెత్తిన ఎత్తిన బోనంపై నిలిపిన జ్యోతిఆరకుండా బోనంతో సహా నేలపై పడుకుని రూపాయి నాణాన్ని నోటితో తీసే ఘట్టం ప్రేక్షకులను తన్మయత్వానికి గురిచేసేది. అలాగే బోనం తలపైన పెట్టుకోని నృత్యం చేయడం, ఎగురుతూ పొర్లుదండాలు చేసేఘటన చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. హైదరాబాద్ భాగమతి మైదానంలో జరిగిన తెలంగాణ ఉద్యమ సభలో మిద్దెరాములు ఎత్తిన బోనం ధూంధాం వేదికను ఉర్రూతలూగించింది. ఉద్యమ కెరటమై నిలిచింది.1990లో మారిషస్లో జరిగిన తెలుగు మహాసభల్లో ఆయన ఒగ్గుకథ వినిపించారు. 2010 నవంబర్ 25న ఆయన కన్నుమూశారు. ఒగ్గుకథ ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటుందనడంలో సందేహంలేదు.