విజయవాడ, (సిరా న్యూస్);
రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అభ్యర్దుల ఎంపిక పైనా కసరత్తు వేగవంతం చేసారు. అటు టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనా బీజేపీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఇటు వైసీపీ నేతలు జనంలో ఉన్నారు. చంద్రబాబు..పవన్ ఏపీ రాజకీయాలకు విరామం ఇచ్చారా అనే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టోతో సహా పొత్తుల పైన ఈ రెండు పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు జగన్ కు కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. ప్రజల్లోకి వైసీపీ నేతలు: వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో వైసీపీ శ్రేణులు జనం మధ్యలో ఉన్నారు. సామాజిక బస్సు యాత్ర పేరుతో నియోజకవర్గాలు తిరుగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల్లో చిక్కుకొని సోమవారం రోజున బెయిల్ పొందారు. అటు జనసేనాని పవన్ తెలంగాణలో బీజేపీతో..ఏపీలో టీడీపీతో పొత్తుతో అంతు చిక్కని రాజకీయంతో ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ కార్యక్రమాలు ఏపీలో దాదాపు లేవనే చెప్పాలి.జనసేనాని మూడు నియోజకవర్గాల్లో చేసిన వారాహి యాత్ర తరువాత ముందుకు కదల్లేదు. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న పవన్ అక్కడ ఎన్నికలు..సినిమాలతో, ఏపీ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలకు గ్యాప్ ఇచ్చారు. ఈ రెండు పార్టీల్లోని పరిస్థితులు వైసీపీ అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు పార్టీల నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో సీట్ల కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. ఎన్నికల వేళ ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక..ఈ రెండు పార్టీలు 11 అంశాలతో మేనిఫెస్టోకు రూపకల్పన చేసాయి. టీడీపీ గత మహానాడు వేదికగా ప్రకటించిన సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టోను కొనసాగించి..తుది మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించారు.