జనసేనతో కలిసి వ్యూహరచన……….

విజయవాడ, (సిరా న్యూస్);
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ రూపొందిస్తున్నారు. సెప్టెంబ‌ర్ తొమ్మిదో తేదీన భ‌విష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల ప‌ర్యట‌న‌లో ఉండ‌గా చంద్రబాబును స్కిల్ కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ త‌ర్వాత చంద్రబాబు జైలుకి వెళ్లడంతో టీడీపీ కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇటీవ‌ల చంద్రబాబుకు ఆరోగ్య కార‌ణాల‌తో హైకోర్టు ఈనెల 28 వ‌ర‌కూ మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఈనెల 20వ తేదీన చంద్రబాబుకు రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు చేసింది. మ‌ధ్యంతర బెయిల్‌తో జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్రబాబు హైద‌రాబాద్‌లో వైద్య ప‌రీక్షలు చేయించుకున్నారు. ఆ త‌ర్వాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుప‌త్రిలో కాట‌రాక్ట్ స‌ర్జరీ కూడా చేయించుకున్నారు. అయితే, కోర్టు విధించిన ష‌ర‌తుల‌కు లోబ‌డి ఆయ‌న రాజ‌కీయంగా కూడా కొన్ని అంత‌ర్గత స‌మావేశాలు నిర్వహించుకున్నారు. మిత్రప‌క్షం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో కూడా చంద్రబాబు స‌మావేశ‌మై భ‌విష్యత్ వ్యూహాల‌పై ఓ నిర్ణయానికి వ‌చ్చారు. ఇదంతా ఒక ఎత్తయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన రెగ్యుల‌ర్ బెయిల్ తో చంద్రబాబుకు భారీ ఊర‌ట ల‌భించింది. న‌వంబ‌ర్ 29 వ తేదీ నుంచి చంద్రబాబు ర్యాలీలు, రాజ‌కీయ ప‌ర‌మైన స‌మావేశాల్లో పాల్గొన‌వ‌చ్చని హైకోర్టు సూచించింది. కోర్టు ఉత్తర్వుల‌తో చంద్రబాబు రాక‌ కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నాయి.చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొంటారు. మంగ‌ళ‌గిరిలోని కేంద్ర కార్యాల‌యానికి ఎప్పుడు వ‌స్తారు..? ప్రజ‌ల్లోకి ఎప్పటి నుంచి వస్తారనే విషయాలపై పార్టీ కేడ‌ర్ లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే టీడీపీ ముఖ్య నేత‌ల స‌మాచారం ప్రకారం ఈనెల 29 నుంచి చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటార‌ని తెలిసింది..ఈనెల 24 నుంచి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర తిరిగి ప్రారంభించాల‌ని అనుకున్నారు. అయితే ఇది కాస్తా 27కు వాయిదా ప‌డిన‌ట్లు తెలిసింది.. పాద‌యాత్ర మ‌ధ్యలో నిలిచిపోయిన కోన‌సీమ జిల్లా రాజోలు నుంచి తిరిగి ప్రారంభించేలా లోకేష్ రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. సుమారు రెండు నెల‌ల‌కు పైగా తెలుగుదేశం పార్టీలో మ‌ళ్లీ కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. ఇలా చంద్రబాబు, లోకేష్ పర్యటనలు చేస్తూనే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి కూడా ఉమ్మడి కార్యక్రమాలు రూపొందించేలా క‌స‌ర‌త్తు చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *