నెల్లూరు, (సిరా న్యూస్);
తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరి జలాల విషయంలో నిత్యం వివాదాలు, ఘర్షణలు చూస్తూనే ఉన్నాం. అలాగే ఆంద్రప్రదేశ్, తమిళనాడు మధ్య పులికాట్ సరస్సు(ప్రళయ కావేరి) వేదికగా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. పులికాట్ మొత్తం విస్తీర్ణం 640 చదరపు కిలోమీటర్లు. అందులో 84 శాతం ఆంద్రప్రదేశ్ లోనే ఉండగా మిగిలిన 16 శాతం తమిళనాడులో ఉంటుంది. అది ఇప్పుడు 240 కిలోమీటర్లకు కుంచించుకు పోయింది. భూభాగం ఏపీలో ఎక్కువగా ఉన్నా నీటి శాతం తమిళనాడులో ఎక్కువగా ఉంది. ఎంత అంటే తమిళనాడు భూభాగంలో సరస్సులో నీటి శాతం 80 శాతం ఉంటే కేవలం 20 శాతం మాత్రమే ఆంద్రప్రదేశ్ భూభాగంలో ఉంది. అందుకు కారణం సముద్రాన్ని అనుకుని ఉన్న పులికాట్ ఉప్పునీటి సరస్సుకు జీవమైన నీరు వచ్చేది సముద్రం నుంచే. గతంలో సహజ సిద్ధంగా ఉండే ముఖ ద్వారాల నుంచే అవి కాస్త పూడికతో నిండిపోవడంతో సరస్సులో నీటి శాతం తగ్గిపోయింది. ఒకప్పుడు నిత్యం నీటీతో నిండిపోయి ఉండే ఈ సరస్సు ఏపీలో ఏడారిలా మారిపోయింది. నీరు పుష్కలంగా ఉంటే మత్స్య సంపద విరివిగా ఉంటుంది. పులికాట్ సరస్సుపై ఆధారపడి లక్షలాది మంది జాలర్లు జీవిస్తున్నారు. ప్రస్తుతం వీరందరికి ఉపాధి లేకుండా పోయింది.
తమిళనాడు తీరంలో ఉండే ముఖద్వారాలను మాత్రం ఏటా అక్కడి ప్రభుత్వం పూడిక తీయిస్తోంది. దీంతో అక్కడ నీటి సామర్ధ్యం ఉంటోంది. ఏపీలో మాత్రం పూడిక తీత జరగడం లేదు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇదొక ఎన్నికల ప్రచారాస్త్రంగా మారుతోందే తప్ప పరిష్కారం మాత్రం లేదు