రామగుండం,(సిరా న్యూస్);
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఓ జాతీయ పార్టీకి చెందిన నాయకులకు సంబంధించి పెద్ద ఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీపీసీ కృష్ణా నగర్ లోని ఓ తాళం వేసిన ఇంటిలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు అర్థరాత్రి ఇంటికి వెళ్లి అక్కడి నుండి రెండు కోట్ల 18 లక్షల 90 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులతో పాటు ఎన్నికల పరిశీలకులు విచారణ చేపట్టారు. ఎవరికి సంబంధించిన డబ్బులు… ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకువెళ్తారనే విభిన్న కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా జాతీయ పార్టీకి చెందిన నాయకుడా కాదా అనే విషయంలో కూడా విచారిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు దొరకడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.