సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల తరలింపు
హైదరాబాద్,(సిరా న్యూస్);
తెలంగాణలో పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఎలక్షన్ కమిషన్ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 24గంటల పాటు సీసీటీవీ మానిటరింగ్ తో మూడంచెల భద్రత కల్పిస్తూ ఎక్కడా ఎలాంటి అసాంఘీక ఘటనలు జరగకుండా గట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది. మరో వారం రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఎలక్షన్ కమిషన్. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించేలా చర్యలు చేపడుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ఇప్పటికే కేంద్ర బలగాలను తరలించింది. రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 10 వేలకు పైగా సమస్యాత్మకంగా ఉన్నట్లు ప్రకటించింది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఐదు అంచెల భద్రత ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది
రాష్ట్రం వ్యాప్తంగా 33 జిల్లాలు, 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 8జిల్లాల పరిధిలో 600వందలకు పైగా పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నట్లు సమాచారం.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, రామగుండం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సెంట్రల్ ఫోర్సెస్ ను ఇప్పటికే తరలించారు. భద్రాచలం, బెల్లంపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, యెల్లెందు, ములుగు, భూపాలపల్లి, మంథని, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ బలగాలను రంగంలకి దించారు.
తెలంగాణ వ్యాప్తంగా 250కి పైగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 166 చెక్ పోస్టులను ఏర్పాటు చేసారు.వాహనాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే అత్యంత సమస్యాత్మకంతో పాటు మావోయిస్టు ప్రభావిత పోలింగ్ స్టేషన్ల వద్ద క్విక్ రియాక్షన్ టీమ్స్ ను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపనున్నారు. ఫ్లెయింగ్ స్క్వాడ్లను ఆయా ప్రాంతాల్లో మోహరించనున్నారు.