-గెలుపులపై ఎవరి ధీమా వారిదే
-ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చూస్తున్న పలు పార్టీలు
– తెలంగాణలో మంగళవారం సాయంత్రం నుంచే మూతపడ్డ మద్యం షాపులు
-ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల అధికారులు
సిరా న్యూస్,మంథని;
దాదాపు నెల రోజులపాటు హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారపర్వం పరిసమాప్తం అయింది. రాజకీయ నాయకుల మైకులు, ప్రచార వాహనాలు, పార్టీల పాటలు ఎక్కడికక్కడ ఆగిపోనున్నాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ పోలింగ్ గురువారం జరగనుండడంతో మంగళవారం సాయంత్రం ప్రచారం ముగిసింది. దీంతో మిగిలిన అతికొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.
తెలంగాణ ఎన్నికల సందర్భంగా… గత నెల రోజులుగా హోరాహోరీ ప్రచారం జరిగింది. సభలు, ర్యాలీలు, రోడ్‌షోలతో ఉవ్వెత్తున ప్రచారం నిర్వహించాయి రాజకీయ పార్టీలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచార రథాలు పెట్టి ఊరూరా ఊదరగొట్టారు. పాటలతో మారుమోగించారు. తమకే ఓటు వేయాలని… మైకులు అరిగేలా ప్రసంగాలు చేశారు. సాయంత్రం వరకు ప్రచారం చేసి… సమయం ముగిసిన తర్వాత ఎక్కడివాళ్లు అక్కడ సద్దుకోనున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు తెలంగాణ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. మంగళవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో మంగళవారం సాయంత్రం నుంచే మద్యం షాపులు మూతపడ్డాయి.