హైదరాబాద్, (సిరా న్యూస్);
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ దగ్గరపడంతో ప్రచార పర్వంలో పొలిటికల్ పార్టీలు స్పీడు పెంచాయి. అగ్రనేతలు అందరిని రంగంలోకి దింపుతున్నాయి జాతీయ పార్టీలు. మిషన్ తెలంగాణ పేరుతో దక్షిణాది మీద స్పెషల్‌గా ఫోకస్ చేసిన భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీ నుంచి హేమా హేమీలను రప్పిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలి విడత టూర్లతో గేరు మార్చబోతోంది కమలం పార్టీ. అంతకంటే స్పెషల్ ఏంటంటే.. నవంబర్ 24 నుంచి మూడు రోజుల పాటు ఇక్కడే మకాం పెట్టబోతున్నారు ప్రధాని మోదీ.బీజేపీ జెండా-సకల జనులకు అండ’ అనే స్లోగన్‌తో ప్రచారాన్ని పీక్స్‌లో నడిపిస్తోంది కమలం పార్టీ. తెలంగాణ సమగ్రాభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యం అంటూ జాతీయ నేతలను రప్పించి విజయ సంకల్ప సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తోంది బీజేపీ. గురువారమే తెలంగాణకు వచ్చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు ఆర్మూర్‌లో జరిగే విజయసంకల్ప సభలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్ పేట నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తారు.ఎన్నికల ప్రచారం చివరి రోజైన నవంబర్ 28న మరోసారి రాష్ట్రానికి వస్తారు అమిత్ షా. ఒకేరోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.