సిరా న్యూస్, అంతర్జాతీయo:
దాడులతో కాదు.. ఆకలితో చచ్చిపోతున్నాం.. గాజాలో దారుణ పరిస్థితులు..
ఉత్తర గాజాలో పరిస్థితులు రోజురోజుకు దయనీయంగా మారుతున్నాయి. దాడుల కన్నా ఆకలి బాధతోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి.పేదరికం, నిరుద్యోగం తర్వాత ఇప్పుడు ఆహార కొరత పెను విపత్తుగా మారింది. బాంబు దాడితో సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకోలేకపోతున్నాయి. ఫలితంగా ఆహారం లభ్యత చాలా తగ్గిపోయింది. ఈ క్రమంలో 2.2 మిలియన్ల మంది కరవు అంచున ఉన్నారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. జబాలియాకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజా సిటీలోని ఆస్పత్రిలో పోషకాహార లోపంతో రెండు నెలల పాప చనిపోయింది. ఈ యుద్ధం కారణంగా గాజాలో ఇప్పటివరకు కనీసం 29,606 మంది మరణించినట్లు గాజా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆహార కొరత కారణంగా సరఫరా తగ్గిపోయింది. దీంతో వాటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కిలో బియ్యం ఏడు షెకెళ్ల ( దాదాపు 121 రూపాయలు) నుంచి 55 షెకెళ్లకు ( దాదాపు 1260 రూపాయలు ) పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్దవాళ్లం కాబట్టి ఎలాగో అలా ఆకలిని ఓర్చుకోగలం కానీ.. చిన్నపిల్లలు ఆకలిని ఎలా తట్టుకుంటారని తడారిన గొంతులతో ప్రశ్నిస్తున్నారు అక్కడి బాధితులు. వైమానిక దాడులతో కాకుండా ఆకలితో చనిపోయే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడం కారణంగా పిల్లల్లో ఆకలి చావులు పెరగవచ్చని యూనిసెఫ్ ఇప్పటికే హెచ్చరించింది.ప్రస్తుత పరిస్థితుల్లో గాజాలో రెండేళ్లలోపు వయసున్న ఆరుగురిలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆకలి తట్టుకోలేక పశుగ్రాసం, గడ్డిని సైతం తింటుండటం గమనార్హం. ఆహార కొరత కారణంగా ప్రజలు సహనం కోల్పోతున్నారు. కోపం పెరిగిపోతోంది. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రోడ్లపై గుంపులుగా వచ్చి నిరసలు చేస్తున్నారు.