సిరా న్యూస్, గొల్లప్రోలు
దెబ్బతిన్న ఉద్యానవన పంటలను పరిశీలించిన ఏడీ మల్లిఖార్జున్..
మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో అకాల వర్షాలు సృష్టించిన బీభత్సానికి పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. మూడు రోజులు పాటు కురిసిన వర్షాలకు సంభవించిన పంట నష్టంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల వీచిన ఈదురు గాలులకు ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి .ప్రధానంగా అరటి, మిరప పంటలు సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నేడు ఉద్యానవన ఏడీ మల్లిఖార్జున్, జడ్పీటీసీ వులవకాయల నాగలోవరాజు అకాల వర్షాలతో దెబ్బతిన్న మిర్చి పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఏడీ మల్లిఖార్జున్ మాట్లాడుతూ.. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో 750 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని తెలియజేశారు. అదే గొల్లప్రోలు మండలంలో 192 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, పిఠాపురం మండలంలో 43 హెక్టార్లలో అరటి పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆయన వ్యవసాయ అధికారులు, సంబంధిత ఉన్నతాధికారులకు నివేదికలు పంపించినట్లు తెలిపారు.