హైదరాబాద్, (సిరా న్యూస్);
తెలంగాణలో పోలింగ్ పండుగకు వేళయింది.. ప్రచారానికి ఇంకా కొన్ని గంటల మాత్రమే గడువు మిగిలింది. దీంతో తెరవెనుక ప్రలోభాల పర్వాన్ని ఉధృతం చేశాయి అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు. ఈ క్రమంలో బుసలు కొడుతున్న నోట్ల కట్టలు.. బయటపడుతున్నాయి.ప్రజాస్వామ్యపు అతి పెద్ద పండుగ ఎన్నికలు.. నోట్ల జాతరగా మారిపోయింది. ఓట్ల పండుగ కోట్ల రూపాయల చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ ఎన్నికలు.. భారతదేశ ఎన్నికల చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ కృష్ణనగర్‌లో సోదాలు నిర్వహించిన ఎలక్షన్ టీమ్.. భారీగా నగదును సీజ్ చేసింది. ఓ ఇంటి తలుపులు పగులగొట్టి, రూ. 2 కోట్ల 18 లక్షల 90 వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు ఎవరిది..? ఎందుకోసం తీసుకువచ్చారు అన్న దానిపై విచారణ చేపట్టారు.హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ డివిజన్‌లో స్థానికులకు డబ్బులు పంచుతున్న ఓ వ్యక్తి నుండి రూ. 3 లక్షల 50 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బును ఎవరు పంచమన్నారు? ఎక్కడి నుండి తీసుకొచ్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నారాయణ పేట జిల్లా కోటకొండలో డబ్బుల సంచులతో వెళ్తున్న పలువురు నేతలను అడ్డుకున్నారు గ్రామస్తులు. నగదుతో దొరికిన నేతలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో పలువురు నేతలు కారులో తప్పించుకున్నారని చెబుతున్నారు గ్రామస్తులు.తెలంగాణ అనేక అంశాల్లో దేశానికే తలమానికంగా నిలిచింది. చాలా రంగాల్లో నెంబర్ వన్‌గా ఎదిగింది. ఇప్పుడు ఎన్నికల ఖర్చు విషయంలో కూడా తెలంగాణ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అయిందంటున్నారు విశ్లేషకులు. ఈ ఎన్నికల్లో ధన ప్రవాహమే అందుకు సాక్ష్యం అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు పోలీసులకు పట్టుబడ్డ నగదు, నగల విలువ 709 కోట్ల రూపాయలకు పైమాటే. ఇక అధికారులకు పట్టుబడకుండా ఎంతమొత్తం తరలిందో అంచనా కూడా వేయలేమంటున్నారు. ఇక ప్రచారం గడువు ముగిసిన తర్వాత ప్రలోభాల పర్వం పీక్స్‌కు చేరే అవకాశం ఉంది. దీంతో ఇంక ఎంతమొత్తం నగదు పట్టుబడుతుందో చూడాలి..!