నలబై ఏండ్ల మీ కలలను సాకారం చేసిన చరిత్ర నాదే -పదవులిచ్చి గౌరవిస్తే పైసల కోసం మోసం చేసిండ్లు

మంథని,(సిరా న్యూస్);
నలబై ఏండ్ల మీ కలలను సాకారం చేసిన చరిత్ర నాదేనని, ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన అనేక అభివృధ్ది పనులను నాలుగేండ్లలో చేసి చూపించానని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా గురువారం మంథని మండలం విలోచవరం, పోతారం,ఉప్పట్ల గ్రామాల్లో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయాంలో పాలకులు ప్రజల కష్టాలు, కన్నీళ్లు పట్టించుకోలేదన్నారు. అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి అభివృధ్ది పనులు చేశామని తెలిపారు. అయితే గ్రామాలు ప్రగతిబాటలో పయనించాలని ఆలోచన చేస్తూ ఇక్కడి స్థానిక నాయకులను ప్రోత్సహిస్తే కోట్లాది రూపాయలు సంపాదించుకుని పార్టీలు మారుతున్నారని అన్నారు. స్తానికంగా ప్రజల నుంచి తిరస్కరించబడి, రాజకీయ భవిష్యత్‌ లేకుంటే అన్నా నీవే దిక్కు అంటూ వస్తే నమ్మి అన్నం పెడితే సున్నం పెట్టాడని ఆయన వివరించారు. బీసీలు,ఎస్సీలు ఎదుగాలని, సమాజంలో మంచి గౌరవించబడాలని ఆలోచన చేసి పదవులు ఇస్తే పైసల కోసం మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు మారడానికి ఒక సమయం, ఒక లెక్క ఉంటుందని, కానీ ఇక్కడ మాత్రం నాయకులు అమ్ముడు పోయి ఊర్లకు చెడ్డపేరు తీసుకువస్తున్నారని అన్నారు. విలోచవరం గ్రామానికి చెందిన ఓ నాయకుడిని ఆదరించి అన్నం పెడితే ఈ ఊరిలో అభివృధ్దిని అడ్డుకున్నాడని, కేవలం పైసల కోసం ఇక్కడి సర్పంచ్‌ను సైతం ఇబ్బంది పెట్టాడని అన్నారు.ఎమ్మెల్యేగా ఎంతోమంది బీద ఆడబిడ్డల పెండ్లిళ్లు, పేద విద్యార్ధులకు చదువులు, ఆస్పత్రుల్లో వైద్యం చేయించానని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ అధికారంలోకి రాగానే పించన్‌లు, రైతుబంధు పెంపు, సౌభాగ్యలక్ష్మిపేరిట ప్రతి మహిళకు మూడు వేలు, రైతుబీమా తరహాలో కేసీఆర్‌ ఐదు లక్షల బీమా, నాలుగు వందలకే గ్యాస్‌సిలిండర్‌ అందించడం జరుగుతుందని, ఈ పథకాలతో పాటు ప్రతి ఏటా పేదింటి ఆడబిడ్డలకు ట్రస్టు ద్వారా పెండ్లిళ్లు, పేద విద్యార్ధులకు హైదరాబాద్‌లో రెండు హస్టల్‌లు ఏర్పాటు చేసి రూపాయి ఖర్చు లేకుండా ఉన్నత చదువులు చదివించే బాధ్యత తనదేన్నారు. అంతేకాకుండా గృహలక్ష్మిపథకం ద్వారా పేదకుటుంబాలకు ఇండ్లు మంజూరీ చేయించి ఆ ఇంటి నిర్మాణంతో తనవంతు సాయం చేసి దగ్గరుండి ఇంటి నిర్మాణం చేయిస్తానని హమీ ఇచ్చారు. ఆదరించి ఆశీర్వదిస్తే ఐదేండ్లు మీసేవకుడిగా పనిచేస్తానని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *