ఓటర్లకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ విజ్ఞప్తి
హైదరాబాద్, (సిరా న్యూస్);
తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించిందని.. అలాగని ప్రతి ఒక్కరు ఆ రోజును హాలిడే (సెలవు రోజు)గా కాకుండా ఓటింగ్ డే (ఓటు వేసే దినం)గా గుర్తించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికలఅధికారి వికాస్‌రాజ్ కోరారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేశారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్నదని, ఈసారి పెంచేందుకు చర్యలుతీసుకుంటున్నామని చెప్పారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి విధి, బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్‌లో ఓటర్లు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికలసంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని తెలిపారు. బీఆర్‌కేఆర్ భవన్‌లో గురువారం ఆయన ఇతర అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఓటర్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటు చేశామని, పోలీసులు సహా దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 4,70,270 పోస్టల్ బ్యాలట్‌లను ప్రింట్ చేశామని,ఈవీఎంల కోసం 8,84,584 బ్యాలట్ పేపర్లను ముద్రించామని చెప్పారు. టెండర్ ఓటు, చాలెంజ్ ఓటు కోసం అదనంగా బ్యాలెట్ పేపర్లను ముద్రించామని తెలిపారు. 51 లక్షల ఓటరు గుర్తింపుకార్డులను ముద్రించి పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఇండ్లకు పంపించామని చెప్పారు.