పధకాలకు… ఫించన్లకు లేఖ

అనంతపురం, (సిరా న్యూస్);
తాము సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినట్లు వైసిపి సర్కార్ చెబుతోంది. ఇందులో ఎవరికీ సందేహం లేదు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డిది. కానీ అది ఎంతవరకు? అభివృద్ధి చేపట్టకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడం భావ్యమా? కచ్చితంగా అది విఫల ప్రయత్నంగానే మిగులుతుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు చేపడితేనే ఆ ఫలాలు ప్రజలు అనుభవించేది. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ప్రభుత్వంగా గుర్తించబడుతుంది. అయితే ఏపీలో దురదృష్టవశాత్తు గత నాలుగున్నర సంవత్సరాలుగా అభివృద్ధి జాడ లేకపోయింది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. అభివృద్ధి ఫలాలేవి కనిపించకపోవడం లోటుగా మారింది.ప్రజలు ఎంతో నమ్మకంగా ఓటు వేశారు. అంతకుమించి సంక్షేమాన్ని అమలు చేశామని వైసిపి పాలకులు చెబుతున్నారు. ప్రజలు మాత్రం సంక్షేమంతో సరిపెట్టడం లేదు. అంతటితో సంతృప్తి చెందడం లేదు. అభివృద్ధి కావాలని బలంగా కోరుకుంటున్నారు. ఇది వైసీపీ ప్రజాప్రతినిధులకు ఇబ్బందిగా మారింది. ప్రజలకు ఏం చెప్పాలో తెలియక.. ఏదేదో వ్యాఖ్యలు చేస్తున్నారు. అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. తాము ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు, నాయకులమని మరిచిపోయి వ్యవహరిస్తున్నారు.పింఛన్లు ఆపేస్తే రోడ్లు వేయవచ్చు అంటూ ఒకరు…ఒక్క పథకం నిలిపివేస్తే రాష్ట్రంలోని వేల కిలోమీటర్ల రోడ్డు వేయొచ్చు అంటూ మరొకరు.. రోడ్ల కోసం జగన్ పాలనను వదులుకుంటే అది మీకే నష్టమని ఇంకొకరు.. రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలకు అడ్డంగా బుక్ అవుతున్నారు. నవ్వుల పాలవుతున్నారు. సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు రోడ్లెస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయా అని ప్రశ్నించారు. ఒక నియోజకవర్గానికి ప్రతి నెల రూ.15 కోట్ల రూపాయలు పింఛన్ల రూపంలో వెళుతున్నాయని.. రోడ్లు వేయాలంటే ఒక్క నెల పింఛన్ వదులుకోవాలని మరో ఎమ్మెల్యే సలహా ఇస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని అయితే మరో విశ్లేషణ చేశారు. ఒక్క పథకం నిలిపివేస్తే చాలు మొత్తం రహదారులు అద్దాల్లా మెరిసిపోతాయని చెప్పుకొచ్చారు.ఎక్కడైనా అభివృద్ధికి రవాణాయే ప్రధాన మార్గం. రవాణా వసతులు మెరుగుపడితేనే అభివృద్ధి సాధ్యం. మొన్నటి వరకు వైసిపి నేతలు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో రహదారులు అవసరమా అన్నట్టు మాట్లాడుతున్నారు. వైసీపీ నేతల స్పందన పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. నెటిజెన్లు బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా సరే వారు వెనక్కి తగ్గడం లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *