సిరా న్యూస్ ఆదిలాబాద్
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..
అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ..
అర్హులైన ప్రజలంతా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం ఆయన అధికారులు, నాయకులతో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్యెల్యే మాట్లాడుతూ, ఆరోగ్య శ్రీ పథకం 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఏ అనారోగ్య సమస్యకైనా హైదరాబాదు, నాగపూర్ ఆసుపత్రులకు నాణ్యమైన వైద్యం కోసం వెళ్లడం జరుగుతుందని, జిల్లాలోనే మెరుగైన వైద్యం అందేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, మహాలక్ష్మి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్ లలో రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణం, 10 లక్షల పెంపుకు సంబందించిన పోస్టర్ లను అధికారులతో కలిసి శాసన సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం బస్సు ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించి, ఉచిత టికెట్ లను మహిళల ప్రయాణీయకులకు అందజేశారు. అనంతరం మహిళలతో ఎమ్యెల్యే, అధికారులు ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డా. రాథోడ్ నరేందర్, ఆర్.టి.సి ఆర్.ఎం సోలెమాన్, డి.ఎం కల్పన, మున్సిపల్ కమిషనర్ శైలజ, అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైద్య, ఆర్.టి.సి సిబ్బంది, విద్యార్థులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.