జగిత్యాల నవంబర్ 18 (సిరా న్యూస్)
బీఆర్ఎస్‌తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కారు గుర్తుతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రమంతా కటిక చీకట్లు అలముకుంటాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ల పాటు అవకాశం ఇస్తే ఏమీ చేయలేదని, ఇప్పుడు మరొసారి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తరఫున ఎమ్మెల్సీ కవిత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెరువులు నిండినా, ఎండిపోయినా చేపలు అక్కడే ఉంటాయి. కప్పలు మాత్రమే చెరువు నుంచి బయటికి వెళ్తాయి. బీఆర్ఎస్ పార్టీ చేపల వంటిది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కప్పల వంటి వాళ్లన్నారు. ఉద్యమ సమయంలో అధికారంలో లేనప్పుడూ కూడా బీఆర్ఎస్ ప్రజలతో ఉందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉందని చెప్పారు.బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రజలు గెలుస్తారని, బీజేపీ గెలిస్తే ఎవరికీ లాభం లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ తాగు, సాగు నీరు కూడా ఇవ్వలేదని, కాబట్టి మన గురించి మంచి ఆలోచన చేసే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. రుణమాఫీ నిధులు విడుదల కానివ్వకుండా ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారని విమర్శించారు. తెలంగాణ రాక ముందు పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని కోరారు. పదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో పుష్కలమైన సాగునీటి వనరుల వల్ల రాష్ట్రంలో ధాన్యపు భాండాగారంగా మారిందని చెప్పారు. దేశంలో తెలంగాణను సీఎం కేసీఆర్ నంబర్ వన్‌గా తీర్చిదిద్దారని, గతంలో పనుల కోసం తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేవారని, ఇప్పుడు పనుల కోసం ఇతర రాష్ట్రాల వాళ్లు తెలంగాణకు వలస వచ్చే పరిస్థతి ఏర్పడిందని చెప్పారు