కరీంనగర్, (సిరా న్యూస్);
అది బ్రాహ్మణుల కోట.. స్వాతంత్యం వచ్చినప్పటి నుంచి గోదావరి తీరాన ఉన్న ఈ నియోజకవర్గంలో బ్రాహ్మణులదే ఆధిపత్యం.. గుడులు, గోపురాలు.. ఆ కాళేశ్వరుడి సన్నిధానం ఉన్న ఈ మంథని నియోజకవర్గంలో ‘బ్రాహ్మణులే’ గెలుపు ఓటములను శాసించారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. అలాంటి బ్రాహ్మణుల ఆధిపత్యం చెలాయిస్తున్న కోటలో ఒక బీసీ వచ్చాడు. పీవీ నరసింహారావు, శ్రీపాదరావు, శ్రీధర్‌బాబులు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న బ్రాహ్మణ ఆధిపత్యానికి 2014లో చెక్ పెట్టారు. మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన పుట్ట మధు.. కాంగ్రెస్‌లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత పరిణామాలతో టీడీపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున జెడ్పీటీసీగా పోటీచేసి ఘన విజయం సాధించి మొదటి సారి బ్రాహ్మణ ఆధిపత్యానికి చెక్ పెట్టారు. తర్వాత ప్రజారాజ్యంలో చేరి 2099లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ, బ్రాహ్మణుల ఆధిపత్యంతో ఓడిపోయారు. తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ క్రమంలో మంథని పంచాయతీ ఎన్నికల్లో తన భార్య పుట్ట మధును గెలిపించుకున్నారు. మరోసారి మంథనిపై పట్టు నిలుపుకున్నారు. ఈ క్రమంలో 2014లో తెలంగాణ ఏర్పడడంతో వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరారు.జనరల్ స్థానం అయిన మంథనిలో బీసీ బిడ్డ అయిన పుట్ట మధుకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. అప్పటికే శ్రీధర్‌బాబు మంత్రిగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని కేసీఆర్ మంథనిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికితోడు పుట్ట మధు బీసీ బిడ్డగా అన్నివర్గాలను కలుపుకుపోయారు. ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధి చేసి చూపుతానని హామీ ఇచ్చారు. అప్పటికే ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఆయన సోదరుడు శ్రీనుబాబు తీరుతో విసిగిపోయిన మంథని ప్రజలు బీసీ బిడ్డ పుట్ట మధుకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో పుట్ట మధు 80 వేలకు పైగా ఓట్లు రాగా, శ్రీధర్‌బాబుకు 65 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.అయితే మారిన రాజకీయ పరిణామాలు, పుట్టమధుపై చేసిన తప్పుడు ప్రచారం 2018లో మళ్లీ పుట్ట మధును గెలిపించలేదు. ఈసారి శ్రీధర్‌బాబుకే పట్టం కట్టారు. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్ గాలి ఉన్నా.. మంథని ప్రజలు మాత్రం మార్పు కోరుకున్నారు. చిన్నచిన్న పొరపాట్లు మంథనిలో పుట్ట మధు ఓటమికి కారణమయ్యాయి.