మనోధైర్యంతో దూసుకెళ్తున్న బర్రెలక్క.

నాగర్ కర్నూల్,(సిరా న్యూస్);
పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ… అంటారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. సరిగ్గా ఇదే స్ఫూర్తితో తెలంగాణ ఎన్నికల బరిలో శాసనసభ అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఒక సామాన్య నిరుపేద దళిత యువతి దేశవ్యాప్తంగా సంచలనానికి కేంద్ర బిందువు అయింది.
ప్రస్తుతం మన దేశ ఎన్నికలలో ధన ప్రభావం అధికంగా ఉన్నది. ప్రధాన పార్టీలు డబ్బున్న వ్యక్తులను మాత్రమే ఎన్నికల బరిలో నిలుపుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా తమ సమస్యల సాధనకు అధికారమే పరిష్కారంగా భావించి ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ప్రపంచాన్ని ఆకర్షించిన యువతి కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క. ఎన్నికల్లో పోటీ చేసేందుకు డిపాజిట్ డబ్బులు కూడా లేని ఒక యువతి ఎన్నికల్లో ఎంతో తెగువతో నిలవడం అంటే ప్రజాస్వామ్యం పరిఢవిల్లడమే!
మొక్కవోని ఆత్మవిశ్వాసంతో.. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సాంకేతిక విప్లవం ద్వారా బర్రెలక్కగా తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకొని, తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై తనదైన శైలిలో ఆమె తెలిపిన నిరసన ప్రజల హృదయాల్లో ఒక స్థానాన్ని సంపాదించే విధంగా చేసింది.
ఈ ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో తెలియజేసే క్రమంలో… బర్రెలను కాచుకోవడమే మేలని, చదువుకుంటే పట్టాలొస్తాయి గానీ ఉద్యోగాలు రావంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు లక్షలాదిమంది నిరుద్యోగుల వేదనను, ఉద్యోగాలు తెచ్చుకుని తమ కుటుంబాలను పోషించుకునేందుకు పడుతున్న ఆవేదనను కళ్ళకు కట్టినట్లు చెప్పేందుకు ఆమె చేసిన ప్రయత్నం ప్రభుత్వానికి సూటిగా తగిలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *