మహా దివ్య క్షేత్రంగా గోపీనాథ పట్నం

-డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
సిరా న్యూస్,ఉంగుటూరు;
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం గ్రామం రానున్న రోజుల్లో మహా దివ్య క్షేత్రంగా రూపుదిద్దుకోబోతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. తన స్వగ్రామమైన గోపీనాథ పట్నంలో తన తల్లిదండ్రులు కీర్తిశేషులు కొట్టు వెంకటేశ్వరరావు, సరస్వతి పుణ్య దంపతులు 62 సంవత్సరాల క్రితం నిర్మించిన రామాలయం స్థానంలో ప్రస్తుతం పూర్తి రాతి కట్టడంతో రామాలయం పునర్నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 27వ తేదీ సోమవారం నుండి ప్రారంభమైన ఈ మహా కృతువు డిసెంబర్ 1వ తేదీ శుక్రవారం వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఐదు రోజులపాటు విశేష పూజలు, హోమాలు, యజ్ఞ యాగాదులు వంటి దైవిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.  పండిత వేదాంతం రాజగోపాలాచార్య చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ మహా కృతువు జరుగుతుంది. ఇందులో భాగంగా రెండో రోజు మంగళవారం హోమం, అభిషేకాలు నిర్వహించారు. ప్రతిష్టించనున్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి నూతన విగ్రహానికి గో పంచామృతాభిషేకాలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *