సిరా న్యూస్,హైదరాబాద్ ;
మిగ్‌జాం తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించింది. ఈనేపథ్యంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.ఇక మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్, మేడ్చల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు సూచించింది. ఎత్తయిన ప్రదేశాలు, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను అప్రమత్తం చేసింది.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి, ములుగు, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. నేడు, రేపు భారీ వర్షం కురుస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పంపిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నిండిన చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల వద్ద జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.