సిరా న్యూస్,కాకినాడ;
స్కిల్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత దాదాపు రెండున్నర నెలల పాటు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు స్టాండ్ స్టిల్ కు వచ్చేశాయి. ఆ పార్టీ మొత్తం చంద్రబాబు అక్రమ అరెైస్టునకు నిరసనలు, ఆందోళనలలో నిమగ్నమైపోయింది. మధ్యలో రాజమహేంద్రవరం జైలు వద్ద జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ తెలుగుదేశం తో కలిసే ఎన్నికలకు వెడుతుందని ప్రకటించడం, ఆ తరువాత సమన్వయ కమిటీల ఏర్పాటు, వాటి సమావేశాలు, ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలు ఇలా వరుస కార్యక్రమాలు జరిగినా క్షేత్రస్థాయిలో, ప్రజా సమస్యలపై ఆ పార్టీ శ్రేణులు, నేతలు కాన్ సన్ ట్రేట్ చేయలేదనే చెప్పాలి. మొత్తం పార్టీ దృష్టంతా చంద్రబాబు న్యాయపోరాటంపైనే కేంద్రీకృతమైపోయింది. ఈ తరుణంలో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిలు మంజూరు చేయడంతో ఇక ఇప్పుడు తెలుగుదేశం క్షేత్రస్థాయిలో యాక్టివ్ కావడంపై దృష్టిపెట్టింది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆరంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ పెరిగింది. దీనికి తోడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలి యాత్రను త్వరలోనే ప్రారంభించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి యాత్రచేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు విడుదల కావడం, ఆయన నేత్ర చికిత్స, వైద్యపరీక్షలు వంటి కారణాలతో ఆమె యాత్ర కూడా తాత్కాలికంగా ఆగింది. అయితే ఇప్పుడు ఆమె నిజం గెలవాలి యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. వారానికి మూడు రోజుల పాటు ఆమె పర్యటన ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించి అందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు.