రియల్ ఎస్టేట్ కు రైట్ టైమ్……

 

హైదరాబాద్, నవంబర్ 20, (సిరా న్యూస్)
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్లాట్ విక్రయాలు ఆశాజనకంగా ఉన్నా స్థలాల లావాదేవీల్లో సందిగ్ధత నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఇది ఇలానే కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అప్పటికప్పుడు ధరలు పెరిగే అవకాశం తక్కువ కాబట్టి తమ బడ్జెట్ లో స్థిరాస్తులను కొనుగోలు చేసుకోవచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం దూకుడు మీద ఉందంటున్నారు నిపుణులు. హైదరాబాద్ వంటి నగరాల్లో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు కొనసాగుతున్నాయని, తెలంగాణలో మొన్నటి వరకు పరుగులు పెట్టినా రెండు నెలల నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ నిలకడగా ఉందంటున్నారు. ప్రాంతాలను బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికలు ముగిసే వరకు ఇది ఇలానే కొనసాగే అవకాశాలు ఉన్నాయని రియాల్టర్లు అంటున్నారు.స్థిరాస్తి మార్కెట్ నగరం మొత్తం ఒకే తీరున ఉండదని, ప్రాంతాలను బట్టి అక్కడి మౌలిక వసతులను బట్టి మార్కెట్ మారుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం వేలం వేసిన కోకా పేట్, బుద్వేల్, మోకిల వంటి ప్రాంతాల్లో ఎన్నికల ప్రభావం పెద్దగా కనిపించడం లేదంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఇళ్ల ధరలు గతేడాదితో పోలిస్తే 11 శాతం పెరిగాయి అంటున్నారు నిపుణులు.గత మూడు నెలల్లో హైదరాబాద్ లో 7900 ఇళ్లను విక్రయిస్తే అందులో 50 లక్షల లోపు ఇండ్లు కేవలం 749 మాత్రమే విక్రయం జరిగాయంటున్నారు. ఇక 50 లక్షల నుంచి కోటి రూపాయలు వరకు పలికే ఇండ్లు 3247 వరకు విక్రయం జరిగాయని, కోటి రూపాయల పైగా పలికే ఇండ్లు అత్యధికంగా 4329 విక్రయం జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ ప్రకటించింది. ఈ స్థాయిలో ధరలు ఉండడంతో మళ్లీ పెరగకముందే స్థిరాస్తిని కొనుగోలు చేయడం మేలని సూచిస్తున్నారు నిపుణులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *