నిజామాబాద్, (సిరా న్యూస్);
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత మూడవ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, ఈ ఎన్నికలు.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా సాగుతున్నాయి. రెండు దఫాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. సరికొత్త సంక్షేమ పథకాలు, ప్రజాకర్షక హామీలతో ఓటర్లను తమవైపు లాగే ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు ప్రచార పర్వం సాగిస్తోంది. అదే సమయంలో.. బీఆర్ఎస్‌కు ధీటైన పోటీ ఇస్తోంది కాంగ్రెస్. ఏదైతే సంక్షేమం పేరుతో బీఆర్ఎస్ పై చేయి సాధిస్తుందో.. అవే సంక్షేమ పథకాలతో ఎన్నికల కథన రంగంలోకి దూసుకెళ్తుంది. మార్పు రావాలని, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓటర్లకు గాలం వేస్తోంది.
రైతులకు ఇప్పటి వరకు ఇస్తున్న ఎకరానికి రైతుబంధు రూ. 5 వేల మొత్తాన్ని మరోసారి అధికారంలోకి వస్తే.. దశలవారీగా రూ.16 వేలకు పెంచుతామని ప్రకటించింది. ఇక రైతులకు ఇస్తున్న 24 ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామంది. అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించి ఆంక్షలు ఎత్తివేస్తామన్నారు. అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామన్నారు. ధరణి ద్వారా భూకబ్జాలను అరికడతామని ప్రకటన.
రైతులకు కాంగ్రెస్ ప్రకటించిన హామీలు..
‘రైతు భరోసా’ పేరుతో రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు
వ్యవసాయ కార్మికులకు రూ. 12,000
వరి క్వింటాలుకు రూ.500 బోనస్
వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్
రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ
ధరణి స్థానంలో భూమాత తీసుకొస్తామని ప్రకటన.
ఈ పథకాలతో రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. అంతేకాదు.. ఈ పథకాలను జనాల్లో విస్తృతంగా తీసుకెళ్తుంది.
బీజేపీ హామీలు..
బీజేపీ కూడా రైతుల కోసం ప్రత్యేక హామీలు ప్రకటించింది. ధరణి స్థానంలో పార్దర్శకమైన ‘మీ భూమి’ వ్యవవ్థను తీసుకువస్తామని ప్రకటించింది. రైతును రాజు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామంది. విత్తనాల కొనుగోలుకు రూ. 2500 ఇన్‌పుట్ అసిస్టెన్స్ అందిస్తామంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామంది.