సిరా న్యూస్, సిద్దిపేట;
రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన ఏర్పరచుకోవటం మహిళలకు ఎంతో అవసరమని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి అన్నారు. వ్యాధి ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువ? ఎలాంటి లక్షణాలతో ఈ వ్యాధి బయటపడుతుంది అనే అంశాలపై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి అన్నారు.
పెంపొందించుకోవలసిన అవగాహన :రొమ్ములో నొప్పి లేని గడ్డలను నిర్లక్ష్యం చేయకూడదు. 18 ఏళ్ల నుంచే రొమ్ములను పరీక్షించుకుంటూ ఉండాలి. 30 ఏళ్ల పైబడిన తరువాత అల్ట్రాసౌండ్, డిజిటల్ మామోగ్రఫీ పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షలతో గడ్డ చేతికి తగలని సైజులో ఉన్నప్పుడే కనుక్కోగలుగుతారు. లావుగా ఉండే మహిళలలో, పెద్ద రొమ్ములు కలిగిన వాళ్లకు మాత్రమే రొమ్ము క్యాన్సర్ వస్తుందనేది నిజం కాదు. క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి తెలిపారు.
కుటుంబ చరిత్రలో రొమ్ము క్యాన్సర్ ఉంటే?
ఫ్యామిలీ హిస్టరీలో రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉంటే, ఈ క్యాన్సర్ ముందుగానే పసిగట్టటానికి బీఆర్సీఏ 1, బీఆర్సీఏ 2 జెనెటిక్ పరీక్షలు చేయించుకోవచ్చు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే వైద్యుల సూచన మేరకు ముందుగానే రొమ్ములను తొలగించుకోవడం లేదా పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండటం చేయాలి. మహిళ వయసు, పరీక్షా ఫలితాల ఆధారంగా తీసుకోవాల్సింన నిర్ణయం గురించి వైద్యులు నిర్ణయిస్తారని ప్రిన్సిపాల్ లిల్లీ మేరి అన్నారు.