వరంగల్ లో బ్రదర్స్… గెలుపు కోసం ఒకరు.. గెలవాలని మరొకరు

వరంగల్, (సిరా న్యూస్);
వారిద్దరూ సొంత అన్న దమ్ములు. ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వారే ఎర్రబెల్లి దయాకర్ రావు బ్రదర్స్. ప్రత్యక్ష ఎన్నికల్లో కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు మాస్ లీడర్ గా విజయ ఢంకా మోగిస్తుంటే, ఆయన సోదరుడు ప్రదీప్ రావు పార్టీలు మారుతూ విజయాన్ని నమోదు చేసుకోలేకపోతున్నారు.ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరులు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణలో తెలియని వారు ఉండరు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు డీలర్ గా తన జీవితాన్ని ప్రారంభించి.. తెలుగుదేశం పార్టీ స్థాపన తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. మాస్ లీడర్ గా ఇప్పటివరకు అపజయం లేకుండా ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వర్ధన్నపేట నియోజకవర్గం నుండి 1994లో ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేసి సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి ఎర్రబెల్లి వరదరాయేశ్వరరావు పై విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో సైతం ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపి అభ్యర్థిగా విజయం సాధించి వర్ధన్నపేట నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ కొట్టాడు. ఈ నియోజకవర్గం నుండి వరుసగా హ్యాట్రిక్ సాధించిన ఏకైక ఎమ్మెల్యే దయాకర్ రావు. 2009 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో దయాకర్ రావు జనరల్ స్థానమైన పాలకుర్తికి షిఫ్ట్ అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గం లో సైతం 2009లో టిడిపి అభ్యర్థిగా ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధించారు. 2014 ఎన్నికలలో సైతం టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. పాలకుర్తి నియోజకవర్గం లో సైతం వరుసగా మూడుసార్లు గెలిచి నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2008 ఉపఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు ఎర్రబెల్లి దయాకర్ రావు. 1994 నుండి 2023 వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధిస్తూ ఓటమెరుగని నేతగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు.ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయాల్లో ఓటమిరుగని నేతగా కొనసాగుతుంటే.. ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రత్యక్ష రాజకీయాల్లో విజయం సాధించలేక పోతున్నారు. వ్యాపారంలో, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొనసాగిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *