సిరా న్యూస్, పెద్దపల్లి
కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావుపై ఆరోపణలు అర్థరహితమని, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావుకు మతిబ్రమించి అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆయన వ్యాఖ్యలను బట్టి జోకర్ గా మారాడని పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్. రాజయ్య, మాజీ ఎంపీపీ సందనవేని సునీత, మాజీ జెడ్పీటీసీ యాట దివ్యా రెడ్డి అన్నారు. పెద్దపల్లి అమర్ చంద్ కళ్యాణ మంటపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి విజయ రమణారావును భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించేందుకు సిద్ధం కాగా ఓర్వలేకనే గోనె ప్రకాష్ రావు బ్రోకర్ గా మారాడని విమర్శించారు. విజయ రమణారావుకు విదేశాల్లో బ్యాంకు ఖాతాలున్నాయని నఖీలీ పత్రాలు సృష్టించారని అన్నారు. ఆన్లైన్లో విదేశాల్లో ఎట్లా బ్యాంకు ఖాతాలు తెరుస్తారో స్పష్టం చేయాలని నిలదీశారు. ఫేక్ పత్రాలతో ఫన్నీ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఆధారాలుంటే నిరూపించాలని, మరోసారి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. సన్నాయి నొక్కులు నొక్కే గోనేకు ఆదాయం ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రజాహితం పేరుతో అవినీతిపై పోరాటం చేస్తామని చెప్పి స్ధానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై అరోపణలు చేసిన సోకాల్డ్ నాయకులు అదే పార్టీలో చేరి కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. ఫేక్ డాక్యుమెంట్ల సృష్టి ప్రజాహితం బ్యాచ్ పనేనని అనుమానం వ్యక్తం చేశారు. సమావేశంలో బూశనవేన సురేష్ గౌడ్, నూగిళ్ళ మల్లయ్య, బూతగడ్డ సంపత్, ఈర్ల స్వరూప, మస్రత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, దొడ్డుపల్లి జగదీష్, తదితరులు పాల్గొన్నారు.