శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి సారె

– రూ.2.5 కోట్లు విలువైన 5 కిలోల బంగారు కాసులమాల, యజ్ఞోపవీతం సమర్పణ

తిరుమల, నవంబరు 18 (సిరా న్యూస్)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు.

ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తిరుమలలో ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమితీతం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయబద్దంగా సారె ఊరేగింపు మొదలైందని తెలిపారు. ఈ సారె ఊరేగింపుగా కాలినడకన తిరుపతిలోని అలిపిరి, కోమలమ్మ సత్రం, తిరుచానూరు పసుపు మండపం మీదగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందని చెప్పారు. తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పద్మసరోవరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని టీటీడీ నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో అద్భుతంగా నిర్వహిస్తోందని చెప్పారు.

ఈవో ఏవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయం నుండి రూ.2.5 కోట్లు విలువైన 5 కిలోల బరువు గల బంగారు కాసులమాల, యజ్ఞోపవీతం అమ్మవారికి కానుకగా సమర్పిస్తున్నట్టు తెలియజేశారు.

ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టారు. అనంత‌రం శ్రీవారి వక్షఃస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వ‌హించారు. ఆ త‌రువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు.

అక్కడ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆభ‌ర‌ణాలతో కూడిన శ్రీ‌వారి సారెను జెఈవో వీరబ్రహ్మంకు అంద‌జేశారు. అక్క‌డినుండి కోమ‌ల‌మ్మ స‌త్రం, శ్రీ కోదండరామాలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, లక్ష్మీపురం సర్కిల్, శిల్పారామం నుండి తిరుచానూరు పసుపు మండపం వద్దకు సారె చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ మాడవీధుల గుండా ప్రదక్షిణగా వెళ్లి పద్మపుష్కరిణిలో అమ్మ‌వారికి సారె స‌మ‌ర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *